Telugu Academy Books For Competitive Exams : ఉద్యోగ పరీక్షల్లో ఏ ప్రశ్న వచ్చినా తెలుగు అకాడమీ ముద్రిస్తున్న పుస్తకాలే ప్రామాణికం. ఈ పుస్తకాల ద్వారానే అభ్యర్థులు రాసిన పరీక్షలకు జవాబులు చూసుకుంటారు. తాజాగా టీజీపీఎస్సీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఆ పుస్తకాలు ప్రామాణికం కాదని, నిపుణుల కమిటీదే తుది నిర్ణయమని పేర్కొనడంతో అభ్యర్థులు, నిరుద్యోగులు ఆలోచనలో పడ్డారు. రానున్నరోజుల్లో ఉద్యోగ పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే ఏ పుస్తకాలు, మెటీరియల్ చదవాలన్నది సమాధానం దొరకని ప్రశ్నలుగా తయారయ్యాయి.
గ్రూపు-1 తుది కీపై కొందరు ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలుగు అకాడమీ పుస్తకాల్లోని జవాబులను గుర్తించినా వాటిని పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్ తరఫు న్యాయవాది వాదించడం ఆ పుస్తకాల్లో రిఫరెన్స్‌లు లేవని, రీసెర్చ్ వర్క్ చేయలేదని, నిపుణుల కమిటీ నిర్ణయం తర్వాతే తుది ఫలితాలు విడుదల చేశామని టీజీపీఎస్సీ పేర్కొన్న నేపథ్యంలో ఈ గందరగోళం నెలకొంది. దీనిపై హైకోర్టులో ఈనెల 18న తదుపరి విచారణ జరగనుంది.
నిరుద్యోగుల్లో గందరగోళం : ఇప్పటివరకు ఉద్యోగ పోటీ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా భావిస్తూ ఉంటారు. వాటికోసం ఎదురుచూస్తుంటారు. మార్కెట్లోకి ఎన్నో పుస్తకాలు వస్తున్నా అకాడమీ పుస్తకం చదవకుండా కొనకుండా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు చాలా తక్కువ. గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడినప్పుడు పెద్ద ఎత్తున ఈ పుస్తకాలకు డిమాండ్ ఉంటుంది. అకాడమీ సకాలంలో డిమాండ్ మేరకు సమకూర్చలేక చేతులెత్తేసిన సందర్భాలు ఎన్నో. ఈ పరిస్థితుల్లో టీజీపీఎస్సీ తాజాగా హైకోర్టులో వినిపించిన వాదనలు అభ్యర్థులను అయోమయంలోకి నెట్టాయి.