Nine Year Boy Dies by Heart Attack in Jagtial : అమ్మానాన్నలతో సరదాగా గడుపుతూ, ఆటపట్టిస్తూ వారి ఆనందాలకు అవధులు లేకుండా చేసే ఓ తొమ్మిదేళ్ల బాలుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ విషాద ఘటన జగిత్యాల మండల ధరూర్‌లో జరిగింది. తొమ్మిదేళ్ల బాలుడు ఉన్నట్టుండి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం బాలె హర్షిత్ అనే తొమ్మిదేళ్ల చిన్నారి, కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి దర్శనానికి వెళ్లి తిరిగి వచ్చారు.
మార్గమాధ్యలో బాలుడికి వాంతులు కావడంతో స్థానిక వైద్యుని ద్వారా కుటుంబ సభ్యులు చికిత్స అందించారు. ఇంటికి చేరుకున్న బాలుడు అస్వస్థతకు గురి కాగా మళ్లీ చికిత్స నిమిత్తం జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బాలుడి తండ్రి గంగాధర్ జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో పని చేస్తున్నాడు. చిన్నారి హర్షిత్ మౌంట్ కారామిల్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. గుండె పోటుతో బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Heart Attack Symptoms in Kids :ఇటీవల ఉత్తరప్రదేశ్లోని అమ్రోహలో ఐదేళ్ల బాలిక ఆకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు చెప్పిన వైద్యులు, ఆ బాలిక గుండెపోటు(Heart Attack) కారణంగానే మృతి చెందినట్లు నిర్ధారించారు. కొవిడ్ తర్వాత కాలంలో ఎంతో మంది యువకులు హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు పిల్లలు కూడా బలైపోతుండడంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్నపిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ కావాలంటున్నారు.