New Water Tourism in Nallamala Forest :పక్షులు, వన్యమృగాలతో జీవ వైవిధ్యానికి నెలవుగా అలరారుతున్న నల్లమల ఫారెస్ట్‌లో జల పర్యాటకం సరికొత్త రూపు సంతరించుకునేదిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలోని సోమశిల నుంచి ఏపీలోని శ్రీశైలం వరకు సంవత్సరం పొడవునా కృష్ణా నదిపై క్రూయిజ్ షిప్‌లలో టూరిస్ట్‌లో షికారు చేసేందుకు పర్యాటకాభివృద్ధి సంస్థ కసరత్తు చేస్తోంది. మరో వైపు స్పీడ్ బోట్లు.. కేరళలోని అలప్పుజ, జమ్మూకశ్మీర్ శ్రీనగర్‌లోని దాల్ లేక్‌లో తరహాలోని హౌస్‌బోట్ల సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు యోచిస్తోంది.
అలలపై ఆరు గంటల ప్రయాణం : కృష్ణా నదిలో నీళ్లు సమృద్ధిగా ఉండటంతో సోమశిల నుంచి శ్రీశైలం వరకు.. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు క్రూయిజ్ షిప్ టూర్‌ని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ శనివారం ప్రారంభించింది. సోమశిల నుంచి శ్రీశైలం వరకు 120 కి.మీ. దూరం కాగా 6.30 గంటల టైం పట్టింది. ఈ జర్నీలో అబ్బురపరిచే దృశ్యాలెన్నో ఉన్నాయి. ప్రతి శనివారం ప్రారంభమయ్యే టూర్, నదిలో నీటి మట్టం ఆధారంగా ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం ఉందని టూరిజం కార్పొరేషన్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో పర్యాటకాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర సర్కార్ కొత్త పాలసీని తీసుకువస్తోంది.
ఇందులో భాగంగా అనేక అనుకూలతలు ఉన్న నల్లమల అటవీప్రాంతంలో భాగమైన ఉభయ రాష్ట్రాల మధ్య ఉన్న కృష్ణా నదిలో జల పర్యాటకంపై అధికారులు దృష్టిపెట్టారు. సోమశిలలో స్నానఘట్టాల వరకు ప్రెజెంట్ నీళ్లు నిండుగా ఉన్నాయి. మార్చి నుంచి నదిలో నీటి మట్టం క్రమంగా తగ్గుతుంది. జూన్ వరకు కిలోమీటర్ మేర నీళ్లు ఉండకపోవచ్చు. అంత దూరం సిమెంటు ర్యాంప్ నిర్మించి, నీళ్లున్నంత వరకు వెహికల్లో పర్యాటకుల్ని తీసుకెళ్లే ప్లాన్ ఉంది. ఇది కార్యరూపం దాల్చాక ఏడాది పొడవునా సోమశిల-శ్రీశైలం మధ్య క్రూయిజ్ షిప్‌లు తిరిగేందుకు ఛాన్స్ ఉంది. సిమెంటు ర్యాంపు కట్టడంపై మార్చిలో కార్యాచరణ మొదలవుతుందని పర్యాటక సంస్థ అదనపు జనరల్ మేనేజర్ ఇబ్రహీం ‘ఈటీవీ భారత్’కు తెలిపారు.