New Ration Cards in Hyderabad : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వక ఏళ్లు గడుస్తున్నాయి. రాష్ట్రంలో 2014 నుంచి కొత్త కార్డులు జారీ చేయలేదు. ఈ క్రమంలో లబ్ధిదారుల సంఖ్య చాలా పెరిగింది. ఈ పదేళ్లలో పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చిన కోడళ్లు, కొత్తగా జన్మించిన పిల్లలు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు.
ఇలాంటి వారంతా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సమగ్ర సర్వేలో రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. ఈ అప్లికేషన్లు లక్షలాదిగా ఉన్నాయి. వాటిని అధికారులు పరిశీలించి, అర్హులను గుర్తించే పనిలో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ పని మరింత వేగంగా కొనసాగుతోంది. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఆధ్వర్యంలో అధికారులు రంగంలోనికి దిగారు. ఈ మేరకు గురువారం (జనవరి 16) 150 డివిజన్లలో దరఖాస్తుదారులను పరిశీలించారు. దీంతో, కొత్త రేషన్‌కార్డుల జారీచేసే ప్రక్రియ వేగం అందుకున్నట్టైంది.
అతి త్వరగా పూర్తిచేయాలని లక్ష్యం :
లబ్ధిదారుల ఎంపికను చాలా త్వరగా పూర్తిచేయాలని జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. జనవరి 24 నాటికి అర్హుల సెలక్షన్ పూర్తిచేసి, 25వ తేదీన నివేదికను జిల్లా కలెక్టర్లకు అందజేయాలన్నది జీహెచ్‌ఎంసీ టార్గెట్ అని అధికారులు చెబుతున్నారు. మరి, అర్హులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు అన్నప్పుడు, ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారంతో సరిచూస్తారని తెలుస్తోంది. ఇలా అర్హులను గుర్తించి, 26నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
కొనసాగుతున్న పరిశీలన :
ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే ద్వారా గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 22 లక్షల కుటుంబాల వివరాలు సేకరించి, నమోదు చేసినట్టు అంచనా. ఇందులో మెజారిటీ దరఖాస్తుల్లో తమకు రేషన్‌కార్డు లేదని, కొత్త రేషన్ కార్డు కావాలని జనం కోరారు. అవన్నీ పరిశీలించిన తర్వాత అర్హుల లెక్క 83,285గా తేలింది.
అయితే, కొద్ది రోజుల క్రితం అధికారులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేశారు. ఈ సమయంలో కూడా చాలా మంది రేషన్‌కార్డులు లేనివారు తమ వివరాలు నమోదు చేయించుకున్నారు. ఏళ్లతరబడి కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో కొత్తగా జన్మించిన శిశువులు, కొత్తగా వచ్చిన కోడళ్ల పేర్లను తమ కార్డుల్లో యాడ్ చేయాలంటూ వేలాదిగా దరఖాస్తులు చేసుకున్నరు. మరి, వీటిని లెక్కలోకి తీసుకోవాలా? లేదా? అనే అంశం మీద రాబోయే రెండు,మూడు రోజుల్లో ఆదేశాలు రావొచ్చని తెలుస్తోంది.