AP Minister On New pension issuing: ఏపీలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్లను జనవరిలో మంజూరు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అర్హతను బట్టి పింఛన్లు మంజూరు చేయాలని తెలిపారు.
పింఛన్లపై సోమవారం సమీక్ష : సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు వరుసగా రెండు నెలలు పింఛను తీసుకోకపోయినా మూడో నెల ఆ మొత్తం పింఛను కలిపి లబ్ధిదారుకు అందించాలని అధికారులకు సూచించారు. ఈ విధానాన్ని డిసెంబరు నుంచే అమల్లోకి తీసుకురావాలని తెలిపారు. భర్త చనిపోయిన వారు మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించిన వెంటనే వారికి వితంతు కేటగిరీలో పింఛను మంజూరు చేయాలని ఆదేశించారు. సచివాలయంలోని ఛాంబర్‌లో అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సామాజిక భద్రత పింఛన్లపై సోమవారం సమీక్ష నిర్వహించారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇకపై ఏ నెలలోనైనా పింఛను తీసుకోకపోతే ఆ మరుసటి నెల మొత్తం కలిపి ఇస్తారని స్పష్టం చేసింది. రెండు నెలలు తీసుకోలేకపోతే ఆ తర్వాత మూడో నెలలో మొత్తం కలిపి ఇస్తామని తెలిపారు. దీనిపై ఇప్పటికే సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.