NDSA Experts Committee Visit Hyderabad :మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల విషయమై ఏర్పాటు చేసిన జాతీయ డ్యాం సేప్టీ అథారిటీ(NDSA Committee) కమిటీ రాష్ట్రంలో రెండో దఫా పర్యటించనుంది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ ఇవాళ్టినుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనుంది. నీటిపారుదలశాఖ ఇంజినీర్లతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీల ప్రతినిధులతో కమిటీ సమావేశం కానుంది.
కాళేశ్వరం(Kaleshwaram Project) మూడు ఆనకట్టలకు సంబంధించిన ప్రణాళిక, డీపీఆర్ తయారీ, హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్స్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఎస్డీఎస్ఓ, ఎస్సీడీఎస్ ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థలు, నిపుణులతో కమిటీ సమావేశం అవుతుంది. గత పర్యటనలో కొన్ని విభాగాల ఇంజనీర్లతో సమావేశమైన కమిటీ వాటికి కొనసాగింపుగా ఈ దఫా భేటీ నిర్వహించనుంది.
అందుకు అనుగుణంగా సంబంధిత అధికారులు, ఇంజినీర్లు, సంస్థల ప్రతినిధులు అందుబాటులో ఉండేలా చూడాలని రాష్ట్ర నీటిపారుదలశాఖకు సూచించింది. తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్ రీసెర్చ్ లేబరేటరీస్‌లో ఉన్న మూడు ఆనకట్టల మోడల్స్ పనితీరును కూడా పరిశీలించనున్నట్లు ఎన్డీఎస్ఏ కమిటీ తెలిపింది. ఇప్పటికే నిపుణుల కమిటీ ఆనకట్టలను పర్యటించి పలు కీలక వివరాలు సేకరించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఇంజినీర్లు, నిర్మాణ ప్రతినిధులతో సమావేశమై సమాచారం సేకరించనున్నారు.