SLBC Tunnel Accident Update :ఎస్ఎల్బీసీ టన్నెల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో 24 మందితో కూడిన ఇండియన్ ఆర్మీ టీం, రెస్క్యూ టీం, 130 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం, 24 మందితో కూడిన హైడ్రా, సింగరేణి కాలరీస్ నుంచి 24 మందితో రెస్క్యూ టీం, 120 మంది ఎస్డీఆర్ఎఫ్ టీం పాల్గొన్నాయి. సహాయక చర్యలకు ఘటనాస్థలిలో కూలిన మట్టి, నీటితో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
ఎస్ఎల్బీసీ సొరంగం మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలింది. 13.5 కిలోమీటర్ల వరకు సహాయ బృందాలు వెళ్లాయి. మరో అర కిలోమీటర్ వెళ్లేందుకు మట్టి, నీటితో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అడ్డంకులను అధిగమించి ఘటనాస్థలికి చేరుకునేందుకు సహాయక బృందాలు యత్నిస్తున్నాయి. 11 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లాయి. 11 కిలోమీటర్ల నుంచి 3 అడుగుల మేర వరకు నీరు నిలిచిపోయి ఉందని బృందాలు తెలిపాయి. 11 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్ల వరకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నడుచుకొని వెళ్లారు. ఆ తర్వాత టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి.
నీటి ఉద్ధృతికి 80 మీటర్లు వెనక్కి వచ్చిన టన్నెల్ బోరింగ్ :నీటి ఉద్ధృతికి 80 మీటర్ల వెనక్కి టన్నెల్ బోరింగ్ మిషన్ వచ్చిందని రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి.. టీబీఎం వెనక్కి రావడంతో 200 మీటర్ల గ్యాప్ ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ 200 మీటర్ల గ్యాప్లోనే 8 మంది చిక్కుకున్నారని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి. చిక్కుకున్న వారిని పిలుస్తూ స్పందన కోసం ఈ బృందాలు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రెస్క్యూ బృందాలకు టీబీఎం వెనుక భాగం కనిపించింది. పైకప్పు కూలడంతో మట్టితో టీబీఎం కూరుకుపోయింది. టీబీఎంకు ముందు భాగంలో 8 మంది చిక్కుకున్నారని తెలుస్తోంది. ఇద్దరు ఇంజినీర్లు, టీబీఎం ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఇందులోనే చిక్కుకున్నారు.