Naveen Yerneni Name In Kidnapping Case : టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై జూబ్లీహిల్స్‌లో నమోదైన కిడ్నాప్ కేసులో (kidnap Case ) పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. తాజాగా ఈ కేసులో నిర్మాత, మైత్రీ మూవీస్ యజమాని ఏర్నేని నవీన్ పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. తాను 2011లో క్రియా పేరుతో హెల్త్ కేర్ సర్వీస్‌ను (Health Services) ప్రారంభించినట్లు ఫిర్యాదులో పేర్కొన్న వేణు మాధవ్, ఆంధ్రప్రదేశ్‌లో హెల్త్ కేర్ సెంటర్లు, ఖమ్మంలో టెలి మెడిసిన్, జాతీయ రహదారులపై అత్యవసర వాహనాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో హెల్త్‌కేర్ సెంటర్ల ప్రాజెక్టు తమకు వచ్చిన సమయంలో పార్ట్ టైమ్ డైరెక్టర్లుగా సూరెడ్డి గోపాల క్రిష్ణ, రాజశేఖర్ తలశిల, ఏర్నేని నవీన్, మందాలపు రవి కుమార్‌లను నియమించుకున్నామని, బాలాజీ అనే వ్యక్తిని సీఈవోగా (CEO) నియమించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Case Against Mythri Movies Naveen Yerneni :ఇదే క్రమంలో చంద్రశేఖర్ వేగే అనే తనకు తెలిసిన వ్యక్తి తమ కంపెనీలో షేర్లు కొని డైరెక్టర్లతో కుమ్మక్కై, సంస్థ మొత్తాన్ని స్వాధీన పరుచుకునేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. తాను సమ్మతం తెలపకపోవడంతో టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, ఎస్‌ఐ మల్లికార్జున్, మరో ఇన్స్పెక్టర్ సాయంతో కిడ్నాప్ చేయించి, డీసీపీ కార్యాలయంలో చిత్రహింసలకు గురి చేశారని తెలిపారు. చంద్రశేఖర్ చెప్పినట్లుగా వినాలని, లేకుంటే చంపేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో (Complaint) ఆయన పేర్కొన్నారు. రూ.100 కోట్ల తన కంపెనీని అతని పేరుపై రాయించుకునే ప్రయత్నం చేశారని తెలిపారు.
మీడియాకు, ఉన్నతాధికారులకు చెప్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించినట్లు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులకు (Police) రూ.10 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా రాధాకిషన్ రావు అరెస్ట్ వార్తలు విని ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అతని ఫిర్యాదుతో నిందితులపై 386, 365, 341, 120బి రెడ్ విత్ 34, సెక్షన్‌ల కింద కేసు నమోదు (Case Filed) చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.