తెలంగాణ

telangana

ETV Bharat / state

తల్లి గర్భంలోనే శిశువు ఆరోగ్యానికి ఆరంభం - మంచి బ్యాక్టీరియాతో సాఫీగా చిన్నారుల జీవనం

దేహంలోని మంచి బ్యాక్టీరియాలతో సాఫీగా పిల్లల జీవనం - యూకేలో నవజాత శిశువుల జీర్ణకోశంపై అధ్యయనం

Natural Probiotic Discovered In Gut Bacteria
Natural Probiotic Discovered In Gut Bacteria (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 12, 2024, 10:44 PM IST

Natural Probiotic In Gut Bacteria :స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు జన్మనివ్వడం వరకు, ప్రసవం తర్వాత మూడు మాసాల దాకా ఆమె తీసుకునే ఆహారం, నివసించే ప్రదేశం, కొనసాగించే అలవాట్లపై చాలా కాలంగా కొన్ని నిర్దిష్ట పద్ధతులను అనుసరిస్తారు. వాటిని తూచా తప్పకుండా అనుసరించడం తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ఇటీవల యూకేలో జరిగిన ఓ అధ్యయనం స్పష్టం చేసింది. నవజాత శిశువులకు తల్లి నుంచి సంక్రమించే, వారిలో తొలి మూడు నెలల్లో అభివృద్ధి చెందే మంచి బ్యాక్టీరియానే పిల్లల జీవన ఆరోగ్య గమనాన్ని నిర్దేశిస్తుందని ఆ పరిశోధన తెలిపింది.

శిశువుల జీర్ణకోశంలో ఉండే 3 కీలక బ్యాక్టీరియాలు వారికి వచ్చే వ్యాధులకు మెరుగైన చికిత్స విధానాలు కనుగొనడంలోనూ మార్గం చూపుతున్నాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పిల్లలు ఆరోగ్యంగా ఎదగడంలో కీలక భూమిక పోషించే మంచి బ్యాక్టీరియా వారికి సంక్రమించడానికి గర్భిణిగా, బాలింతగా తల్లి తీసుకునే ఆహారం, తల్లిపాలు, ఆమె అలవాట్లు, తదితరాలపై సీనియర్‌ కన్సల్టెంట్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ రాకేశ్‌ కలపాల ఏమంటున్నారో తెలుసుకుందాం.

నవజాత శిశువుల్లో బ్యాక్టీరియాపై పరిశోధనలు ఎందుకు?
మంచి బ్యాక్టీరియా అనేది జీవితాంతం మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. వ్యాధులను కూడా నిరోధిస్తుంది. అందుకే బ్యాక్టీరియాల స్థితిగతులపై పరిశోధన జరగాల్సిన అవసరముంది. వాటితో చిన్నపిల్లలకు ప్రత్యేక చికిత్స విధానాలను రూపొందించవచ్చు. ఈ నేపథ్యంలోనే యూకేలో జరిగిన అధ్యయనంలో అక్కడి నవజాత శిశువుల్లో మూడు కీలక బ్యాక్టీరియాలను గుర్తించారు. మనదేశంలోని పిల్లల జీర్ణకోశం/పొట్ట(గట్‌)లోని బ్యాక్టీరియా ప్రొఫైల్‌ పాశ్చాత్య దేశాల వారితో పోలిస్తే భిన్నంగా ఉంటుంది.

ఎందుకంటే ఆహార అలవాట్లనేవి ప్రాంతాల వారీగా మారుతూ ఉంటాయి. మన శిశువుల్లో నుండే గట్‌ బ్యాక్టీరియాకు సంబంధించి ఇప్పటివరకు నిర్ధారిత సమాచారం లేదు. మనం బయోబ్యాంక్‌ ప్రొఫైల్‌ సృష్టించుకుంటే దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పిల్లల్లో తరచూ వచ్చే ఇన్‌ఫెక్షన్లు, ఎలర్జీల సమస్యను అధిగమించవచ్చు. వారి రోగ నిరోధకశక్తిని పెంపొందించేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ మంచి బ్యాక్టీరియా లోపం ఉంటే మందులు, పోషకాల రూపంలోనూ ఇవ్వొచ్చు. మనవద్ద ఈ మంచి బ్యాక్టీరియాల పరిశోధనలకు సంబంధించి ఇంకా డేటా సేకరణ, విశ్లేషణ దశలోనే ఉంది.

గట్‌ బ్యాక్టీరియా కాలక్రమంలో మార్పులకు గురవుతుందా?
జీర్ణకోశంలో ఉండే బ్యాక్టీరియాను గట్‌ మైక్రోబియమ్‌గా వ్యవహరిస్తారు. ఇది మిలియన్ల సంఖ్యలో ఉండే సూక్ష్మ జీవుల సంక్లిష్ట పర్యావరణ వ్యవస్థ. బిడ్డకు పుట్టుకతో, పుట్టిన మొదటి మూడు మాసాల్లో వచ్చే ఈ బ్యాక్టీరియానే ఆరోగ్యానికి అతి ముఖ్యమైనది. ఇది 3 వారాల నుంచి నుంచి 14 వారాల్లో మార్పులకు గురవుతుంది. అనంతరం 15-30 వారాల తర్వాత స్థిరపడుతుంది. 6 నెలల తర్వాత స్థిరంగా ఉండిపోతుంది. అంటే గట్‌ మైక్రోబియమ్‌ ఆరు మాసాల్లోనే నిర్ధారణ అయిపోతుంది.

సహజ ప్రసవం, సిజేరియన్‌ల ప్రభావమెంత?
తల్లి నుంచి బిడ్డకు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా రావాలంటే వీలైనంత వరకు సహజ ప్రసవానికి ప్రాధాన్యం ఇవ్వాలి. సిజేరియన్‌ చేస్తే శిశువుకు మంచి బ్యాక్టీరియా పూర్తిగా అందకపోవచ్చు. సిజేరియన్‌ చేసినప్పుడు యాంటీబయాటిక్స్‌ వాడతారు. వీటి ప్రభావం కూడా ఉంటుంది. తల్లి మైక్రోబియమ్‌లో సరిపడా ఐజీఏ లెవల్స్‌ ఉంటే పుట్టే పిల్లల వ్యాధి నిరోధక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతాయి. అప్పుడు పిల్లలు ఇన్‌ఫెక్షన్లను సమర్థంగా ఎదుర్కొంటారు. సహజ ప్రసవంతో ఇతర ప్రయోజనాలూ ఉన్నాయి. సహజ ప్రసవంతో జన్మించిన పిల్లలతో పోలిస్తే... సిజేరియన్‌తో పుట్టిన పిల్లల్లో 64% మంది ఊబకాయానికి గురయ్యే అవకాశముందని, వారికి ఎలర్జీ, ఆస్తమా వంటివి సమస్యలూ ఎక్కువగా రావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. సహజ ప్రసవంతో జన్మించిన వారిలో పెద్ద వయసులో గ్లూకోజ్‌ శోషణం మెరుగ్గా ఉంటుంది. డయాబెటీస్‌కు అవకాశాలు తక్కువగా ఉంటాయి.

తల్లిపాల పాత్ర ఏమిటి?
శిశువుల్లో మంచి బ్యాక్టీరియా అభివృద్ధిలో తల్లిపాల పాత్ర అత్యంత కీలకం. బిడ్డకు సాధారణంగా 6 మాసాల సమయం నుంచి ఏడాదిదాకా తల్లిపాలను ఇస్తారు. తల్లిపాల మైక్రోబియమ్‌లో ఉండే మంచి బ్యాక్టీరియాతో పిల్లల్లో రోగనిరోధక శక్తి బలంగా తయారవుతుంది. ఇన్‌ఫెక్షన్లపై పోరాడే సామర్థ్యం పెరుగుతుంది. అందుకే వీలైనంత ఎక్కువ కాలం తల్లిపాలను ఇవ్వగలిగితే బిడ్డకు మంచిది.

పుట్టిన తర్వాత ఎలా స్నానం చేయించాలి?
నవజాత శిశువుల చర్మంలోనూ గుడ్‌ బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే శిశువులను బాగా రుద్దుతూ, ఎక్కువసార్లు స్నానం చేయించడం కూడా మంచిది కాదు. మొదటి మూడు నెలలు ఎక్కువ రుద్దకుండా స్నానం చేయించాలి.

పిల్లల బ్యాక్టీరియాలో తల్లుల పాత్ర ఏమిటి?
శిశువులకు ఉత్తమ బ్యాక్టీరియా లభించడమనేది తల్లుల చేతుల్లోనే ఉంటుంది. అందుకే ప్రెగ్నెంట్​గా ఉన్నప్పటి నుంచి ప్రసవం, ఆ తర్వాత కూడా వారు అప్రమత్తంగా ఉండాలి. గర్భం దాల్చినప్పటి నుంచి తీసుకునే ఆహారం, ఆమె అలవాట్లు గట్‌ బ్యాక్టీరియాను ప్రభావితం చేస్తాయి. ఎల్లప్పుడూ పోషకాహారానికి ప్రాధాన్యమివ్వాలి. పెరుగు, ఆకుకూరలు లాంటి బ్యాక్టీరియా రిచ్‌ఫుడ్‌ తింటే బిడ్డకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. గర్భంతో ఉన్నప్పుడు వచ్చే ఇన్‌ఫెక్షన్లకు ఎక్కువ మంది యాంటీబయాటిక్స్‌ వాడుతుంటారు.

వాటితో పిల్లల గట్‌ దెబ్బతింటుంది. వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండాలి. గర్భిణులు పొగతాగొద్దు. సిగరెట్లు తాగే వారి వద్ద కూర్చోవడం కూడా ప్రమాదకరమే. గర్భిణిగా ఉన్నప్పుడు అధిక ఒత్తిడిని ఎదుర్కోవడమూ మంచి బ్యాక్టీరియాకు నష్టం కలిగిస్తుంది.

యూకేలో జీనోమ్‌ సీక్వెన్స్‌ల విశ్లేషణ
యూకేలోని యూసీఎల్‌ వెల్‌కం శాంగర్‌ ఇనిస్టిట్యూట్, బర్మింగ్‌హామ్‌ యూనివర్సిటీలు జరిపిన సంయుక్త పరిశోధనలో ఆసక్తికర అంశాలు వెలుగు చూసినట్లుగా నేచర్‌ మైక్రోబయాలజీ ప్రత్యేక రీసెర్చ్ పేపర్​ను ప్రచురించింది. 1,288 ఆరోగ్యవంతమైన నెలలోపు శిశువుల నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సులను విశ్లేషించగా పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూసినట్లు పేర్కొంది.

నవజాత శిశువులంతా బి.లాంగమ్, బి.బ్రీవ్, ఇ.ఫెకాలిస్‌ అనే 3 రకాలైన బ్యాక్టీరియాలతో జన్మిస్తారు. వీటిలో బి.లాంగమ్, బి.బ్రీవ్‌లు ఇతర ప్రయోజనకర సూక్ష్మజీవుల స్థిరమైన సమీకరణను ప్రోత్సహిస్తూ ప్రయోజనకరంగా ఉంటాయి. బి.బ్రీవ్‌ తల్లి పాలలోని పోషకాలను పూర్తిగా ఉపయోగించుకొనేందుకు ఉపయోగపడుతుంది. ఇది శిశువులో మెక్రోబియమ్‌ వృద్ధి చెందడానికి దోహదపడుతుంది. ఈ బాక్టీరియా అనేది వ్యాధికారకాలు శిశువుల జీర్ణకోశంలో చేరకుండా నిరోధిస్తుంది. ఇది నేచురల్ ప్రోబయాటిక్‌గా వ్యవహరిస్తుంది. మూడో బాక్టీరియా ఇ.ఫెకాలిస్‌ యాంటీబయాటిక్‌-నిరోధక బ్యాక్టీరియాకు నష్టం కలిగిస్తుంది.

ఈ 3 బ్యాక్టీరియాలతో ప్రతిశిశువుకు ప్రత్యేకమైన చికిత్సా విధానం రూపొందించేందుకు అవకాశం దక్కింది. తదుపరి విస్తృత పరిశోధనల ద్వారా ఈ బ్యాక్టీరియాలు ఆరోగ్యం, వ్యాధులను ఎలా ప్రభావితం చేస్తాయనేది గుర్తించాల్సి ఉంది.

కిడ్నీ వ్యాధి ముప్పు భయపెడుతోందా? - ఈ 5 పండ్లు తినమని సలహా ఇస్తున్న నిపుణులు! - Fruits for Kidney Health

మీ బ్రెయిన్​ను సర్వనాశనం చేసే ఒకే ఒక్క ఆహారం! - మీ తిండిలో ఇది లేకుండా చూసుకోవాల్సిందే! - High Sugar Effects the Brain Health

ABOUT THE AUTHOR

...view details