National Dam Safety Authority Will Visit Medigadda Tomorrow : నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీ నిపుణుల బృందం మేడిగడ్డ బ్యారేజీ సందర్శన కోసం రేపు రాష్ట్రానికి రానుంది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృతంలో మొత్తం ఆరుగురు సభ్యుల బృందం న్యూఢిల్లీ నుంచి రేపు ఉదయం పదిగంటల 20 నిమిషాలకు బయలు దేరి మధ్యాహ్ననికి హైదరాబాద్ చేరుకుంటుంది. సాగునీటి శాఖ కార్యదర్శితో బృందం సమావేశమౌతుంది. గురు, శుక్రవారాల్లో కుంగిన మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం సుందిళ్ల బ్యారేజీలను బృందం పరిశీలిస్తుంది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల అధ్యయనానికి కమిటీ
National Dam Safety Authority : ఈ నెల 9న హైదరాబాద్లో మరోసారి అధికారులతో సమావేశమై రాత్రికి డిల్లీకి బయలు దేరి వెళ్తుంది. నిపుణుల బృందం పర్యటనకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఈ బృందం కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీపై ప్రధానంగా దృష్టి సారించనుంది. కుంగుబాటుకు దారితీసిన లోపాలతో పాటు ఎలాంటి మరమ్మతులు అవసరమో సిఫార్సు చేయనుంది.
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (Medigadda) అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ పనులు చేపట్టాలన్నా నిపుణుల కమిటీ సిఫార్సులు తప్పనిసరి. ఇందుకోసం కమిటీకి విధించిన గడువు నాలుగు నెలలు కాగా సాధ్యమైనంత త్వరగానే నివేదిక ఇవ్వాల్సిందిగా కోరతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. వర్షాకాలంలో గోదావరికి వరద ప్రారంభమైయ్యే పరిస్ధితులను పరిగణనలోకి తీసుకుని బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను నిపుణుల కమిటీ నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందచేస్తుంది.