NaraLokesh Election Campaign in Mangalagiri : కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం దుకాణాల సంఖ్య తగ్గిస్తామని నారా లోకేశ్ మహిళలకు హామీ ఇచ్చారు. నకిలీ మద్యం వల్ల లక్షల సంఖ్యలో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం కృష్ణయపాలెంలో లోకేశ్ పర్యటించారు. అధికారంలోకి రాగానే అమరావతి అభివృద్ధి కార్యక్రమాలను కృష్ణయ్యపాలెం గ్రామం నుంచి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అమరావతికి పెద్ద సంఖ్యలో సంస్థలు తీసుకొచ్చి ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.
AP Elections 2024 :లోకేశ్ ఇటీలే మంగళగిరిలో తాగునీటి సరఫరా అంతరాయంపై గుంటూరు కలెక్టర్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. వేసవి కారణంగా తలెత్తిన తీవ్ర తాగునీటి ఎద్దడిని ప్రభుత్వం పరిష్కరించకపోగా, ఎన్నికల కోడ్ సాకుతో సేవా కార్యక్రమాలు అడ్డుకోవడం తగదని లోకేశ్ మండిపడ్డారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 2022 ఏప్రిల్ 20 నుంచి వాటర్ ట్యాంక్‌ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తోందన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా త్రాగునీటి సరఫరా నిలిచిపోయిందని లేఖలో లోకేశ్ పేర్కొన్నారు. ప్రభుత్వం తీవ్ర సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిపై ప్రభుత్వం ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని లోకేశ్ మండిపడ్డారు.