Shops Evade Rent to Anantapur Municipal Corporation : అడిగినంత ముట్టచెబితే చాలు ఆరేళ్లుగా అద్దెలు కట్టకున్నా అడగరు. లక్షల రూపాయల అద్దెలు ఎగ్గొట్టి దుకాణాల్లోని వస్తువులు సర్దుకుని పోతున్నా చడీచప్పుడు చేయరు. వేలంలో దుకాణాలు పొందిన వ్యక్తి ఎంతమందికి సబ్‌లీజుకు ఇచ్చుకున్నా దుకాణం ముందు తోపుడు బండ్ల నుంచి మామూళ్లు వసూలు చేసుకుంటున్నా పట్టించుకోరు. ఇదీ అనంతపురం నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారుల తీరు. ఈ విభాగంలో పని చేసేందుకు రాజకీయ సిఫార్సులతో పోటీపడుతున్నారంటే ఇక్కడ రాబడి ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
అనంతపురం నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగం అవినీతి, అక్రమాలకు కేంద్రంగా మారింది. ఇక్కడ పనిచేసే సిబ్బంది కార్పొరేషన్ రాబడికి గండికొట్టి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. నగరపాలక సంస్థకు అత్యంత విలువైన స్థలాలతోపాటు ప్రధాన కూడళ్లలో దుకాణ సముదాయాలు ఉన్నాయి.
వేలంలో దుకాణాలు పొందినవారు 25 ఏళ్లపాటు వ్యాపారం చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం వేలంపాటదారుడే వ్యాపారం చేసుకోవాలి. ప్రతి రెండేళ్లకోసారి కొంత మొత్తం అద్దె పెంచుతూ ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయాలి. అయితే వేలంపాటదారులు లక్షలాది రూపాయల అద్దెలు ఎగ్గొట్టినా అధికారులకు ముట్టచెప్పాల్సింది చెబితే చాలు.
పన్నులు చెల్లించం, అద్దెలు కట్టేదిలేదంటూ కోర్టుకు - VMC ఆదాయానికి భారీ గండి
ఏకంగా ఆరు సంవత్సరాల నుంచి అద్దె చెల్లించకపోయినా కనీసం నోటీసు ఇవ్వరు. దుకాణం రద్దు చేయరు. వేలంపాటలో దుకాణం పొందిన వ్యక్తి ఎంతమందికి సబ్ లీజుకు ఇచ్చినా అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అలాగే దుకాణాల ముందు పూలు, పండ్ల అమ్ముకునే తోపుడు బండ్ల నుంచి నగరపాలక సంస్థ రెవెన్యూ సిబ్బంది మామూళ్లు వసూళ్లు చేసుకుంటూ కుబేరులవుతున్నారు. లక్షల రూపాయల అద్దె ఎగ్గొట్టి రాత్రికి రాత్రి వస్తువులన్నీ తీసుకుని వ్యాపారులు పారిపోయినా ఎలాంటి కేసులు పెట్టడం లేదు. దుకాణాల అద్దె బకాయిలే నాలుగున్నర కోట్లు ఉన్నాయంటే సిబ్బంది ఏంతమేరకు లంచాలు తీసుకున్నారో అర్థమవుతోంది.
'నగరపాలకసంస్థ పరిధిలోని 397దుకాణాల్లో 90శాతంపైగా దుకాణాలు వేలం పాడినవారు కాకుండా వేరే వాళ్లు నిర్వహిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మున్సిపల్ కార్పొరేషన్ 50 శాతం అద్దె రాయితీతో దుకాణాలు కేటాయించింది. వీరిలో ఒకరిద్దరు మినహా ఎవరూ దుకాణాలు నిర్వహించడంలేదు. వారికి కేటాయించిన దుకాణాలను ఇతరులకు అధిక అద్దెకు ఇచ్చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. 35 మంది ఆరేళ్లుగా అద్దె చెల్లించకపోయినా నగరపాలక సంస్థ కమిషనర్, రెవెన్యూ సిబ్బంది నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.' - బాలాంజనేయులు, కార్పొరేటర్
'మరో 28 దుకాణాల్లో వ్యాపారులు కోటిన్నర రూపాయలు అద్దె ఎగ్గొట్టి రాత్రికి రాత్రే దుకాణాలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. వీరిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. మార్కెట్ సమీపంలోని ఓ దుకాణంలో ఏకంగా వైన్స్ ఏర్పాటు చేశారు.' - లక్ష్మిరెడ్డి, ఏఎంసీ కౌన్సిల్ సభ్యుడు
రెండురోజుల క్రితం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు అధికారుల అవినీతిపై గళమెత్తారు. దుకాణాల అద్దె ఎగవేతలపై నిలదీశారు.