Marriage Affect On Credit Score : చాలా మంది క్రెడిట్ కార్డులు వాడుతూ ఉంటారు. సకాలంలో ఈఎంఐలు చెల్లిస్తూ తమ క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండేలా చూసుకుంటారు. కానీ పెళ్లి తరువాత ఈ పరిస్థితి మారవచ్చు. ఎందుకంటే పెళ్లి తరువాత ఇంటి ఖర్చుల కోసం, అవసరాల కోసం జాయింట్ లోన్ అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఎలాగో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఇంతకీ క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి?
క్రెడిట్ స్కోర్ అనేది మీ ఆర్థిక స్థితిగతులను, రుణం తీర్చే సామర్థ్యాన్ని తెలుపుతుంది. సాధారణంగా ఈ క్రెడిట్ స్కోర్ 300 -900 మధ్య ఉంటుంది. క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉంటే, దానిని మెరుగైన క్రెడిట్ స్కోర్‌గా చెప్పుకోవచ్చు. ఈ క్రెడిట్ స్కోర్‌ను క్రెడిట్ బ్యూరోలు ఇస్తుంటాయి. భారతదేశంలో ప్రధానంగా నాలుగు క్రెడిట్ బ్యూరో సంస్థలు ఉన్నాయి. అవి:
1. సిబిల్
2. ఎక్స్‌పీరియన్
3. సీఆర్‌ఐఎఫ్
4. ఈక్విఫాక్స్
ఈ క్రెడిట్ బ్యూరోలు వినియోగదారుల క్రెడిట్ రిపోర్ట్‌లు రూపొందించడానికి, వారి సమాచారాన్ని సేకరిస్తాయి. వాటిని ఆర్గనైజ్ చేసి, వ్యక్తుల క్రెడిట్ స్కోర్‌ను నిర్ణయిస్తాయి.
క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేసే అంశాలు ఇవే!
- జాయింట్ క్రెడిట్ అకౌంట్ : చాలా మంది పెళ్లి తరువాత జాయింట్‌గా హోమ్ లోన్ తీసుకుంటూ ఉంటారు. అంటే సదరు రుణాన్ని తీర్చడానికి ఇద్దరూ బాధ్యులు అవుతారు. ఇద్దరూ కలిసి సమయానికి ఈఎంఐ కడుతూ ఉంటే, ఏం ఫర్వాలేదు. ఒకవేళ ఎవరైనా ఈఎంఐ కట్టడానికి సహకరించకపోతే, ఇక అంతే సంగతులు. ఇది ఇద్దరి క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడుతుంది. కొన్నిసార్లు భార్యాభర్తల్లో ఒకరి క్రెడిట్ స్కోర్ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు బ్యాంకులు తాము ఇచ్చే రుణాలపై అధిక వడ్డీని విధించే అవకాశం ఉంటుంది. క్రెడిట్ స్కోర్ మరీ దారుణంగా ఉంటే రుణాన్ని ఇవ్వకపోవచ్చు కూడా. అందుకే భార్యాభర్తలు ఇద్దరూ తమ వ్యక్తిగత క్రెడిట్ స్కోర్లు బాగుండేలా చూసుకోవాలి. లేకుంటే తరువాత ఆర్థికంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
- క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో : క్రెడిట్ కార్డు పరిమితిలో కేవలం 30 నుంచి 40 శాతం వరకు మాత్రమే వాడుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా భార్యాభర్తల్లో ఎవరో ఒకరు పరిమితికి మించి క్రెడిట్ కార్డు రుణాలు తీసుకుంటే, అది వారిద్దరి క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. కనుక క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో విషయంలో జీవిత భాగస్వాములు ఇద్దరూ ఒక మంచి అవగాహనతో ఉండడం మంచిది.
- క్రెడిట్ ఎక్వైరీస్ : భార్యాభర్తలు ఇద్దరూ కలిసి జాయింట్ క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసినప్పుడు, బ్యాంకులు వారిద్దరి ఆర్థిక స్థితిగతుల గురించి, ఆదాయ వనరుల గురించి ఆరా తీస్తాయి. ఒక వేళ వారిద్దరిలో ఏ ఒక్కరి క్రెడిట్ స్కోర్ బాగాలేకపోయినా, వారికి జాయింట్ క్రెడిట్ కార్డ్ మంజూరు చేసే ఛాన్స్ తగ్గుతుంది. లేదా వారి క్రెడిట్ లిమిట్ అయినా తగ్గుతుంది.
- అప్పులు : పెళ్లి తరువాత రుణాలు తీర్చాల్సిన బాధ్యత భార్యాభర్తల ఇరువురిపైనా పడుతుంది. వీటిని సకాలంలో తీర్చేస్తే ఏ సమస్యా ఉండదు. అలా కాని పక్షంలో వారి క్రెడిట్ స్కోర్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది.
మరి పరిష్కారం ఏమిటి?
క్రెడిట్ స్కోర్ దెబ్బతినకుండా ఉండాలంటే, భార్యాభర్తలు ఇద్దరూ తమ ఆర్థిక పరిస్థితుల గురించి చక్కగా చర్చించుకోవాలి. వారి పొదుపు, మదుపు, ఖర్చులు, ఆర్థిక అవసరాలు, ఇప్పటికే ఉన్న అప్పులు, కట్టాల్సిన ఈఎంఐలు - ఇలా అన్ని విషయాల గురించి మాట్లాడుకోవాలి. ఒక పక్కా ప్రణాళిక ప్రకారం రుణాలు తీర్చే ప్రయత్నం చేయాలి. అంతేకాదు తమ వ్యక్తిగత క్రెడిట్ స్కోర్ ఎలా ఉంది? గతంలో ఆర్థికంగా చేసిన తప్పిదాలు ఏమైనా ఉన్నాయా? అనేది కూడా చూసుకోవాలి. అప్పుడే మంచి క్రెడిట్ స్కోర్ మెయింటైన్ చేయడానికి, దీర్ఘకాలంలో తమ ఆర్థిక లక్ష్యాలు సాధించడానికి వీలవుతుంది.
ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవాల్సిందే!
జాయింట్ క్రెడిట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు కచ్చితంగా ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించాలి. క్రెడిట్ పరిమితి మేరకే వాడాలి. సకాలంలో ఈఎంఐలు కట్టాలి. ఈ విషయంలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకేమాటపై నిలబడాలి.
వేర్వేరు అకౌంట్లు ఉండడమే బెటర్!
కొన్నిసార్లు జీవిత భాగస్వాముల అలవాట్లు, అభిరుచులు, ఖర్చులు భిన్నంగా ఉండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో భార్యాభర్తలు ఇద్దరూ వేర్వేరు క్రెడిట్ అకౌంట్లు ఓపెన్ చేయడమే మంచిది. అప్పుడే వారి వ్యక్తిగత క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. భవిష్యత్‌లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.
నోట్ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునేముందు కచ్చితంగా మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
నిరుద్యోగులు కూడా మంచి క్రెడిట్ స్కోర్ మెయింటెన్ చేయొచ్చు! ఈ టిప్స్ పాటిస్తే చాలా ఈజీ!