HC ON SAJJALA BHARGAV REDDY PETITIONS : వైఎస్సార్సీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. మొత్తం 4 పిటిషన్లు విచారణ కోర్టు జరిపింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై తనపై నమోదు చేసిన కేసులు క్వాష్ చేయాలని భార్గవ్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. భార్గవ్ రెడ్డి విషయంలో బీఎన్ఎస్ సెక్షన్ 35(3) అనుగుణంగా నోటీసులు జారీ చేయలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది.
తొలుత సజ్జల భార్గవరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల వ్యవహారంలో తనపైన నమోదైన కేసులు కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించలేదు. విజ్ఞప్తులు ఏవైనా హైకోర్టు ముందు చెప్పుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.
Perni Jayasudha Bail Petition: మరోవైపు వైఎస్సార్సీపీ నేత పేర్ని నానికి చెందిన గోడౌన్లో బియ్యం అక్రమాలపై ఆయన సతీమణి జయసుధపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ను పేర్ని జయసుధ మచిలీపట్నం జిల్లా కోర్టులో దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్పై న్యాయస్థానం నేడు విచారణ చేపట్టగా, తదుపరి విచారణను రేపటికి వాయిదా వేయాలని పేర్ని జయసుధ తరుఫు న్యాయవాది కోరారు. దీంతో విచారణను న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు.
ఇదే కేసులో ఇప్పటికే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్లోని రేషన్ బియ్యాన్ని మచిలీపట్నంలోని మార్కెట్ యార్డుకు తరలించారు. 8 లారీల్లో లోడ్ చేసి పంపించారు. పొట్లపాలెంలో పేర్ని నాని తన భార్య జయసుధ పేరిట గోడౌన్ నిర్మించి పౌరసరఫరాల శాఖకు లీజుకు ఇచ్చారు.
ఆ గోడౌన్లో 185 టన్నుల రేషన్ బియ్యం మాయమవడంతో పేర్ని నాని సతీమణి జయసుధపై పోలీసులు ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారులు సైతం సంబంధిత గోడౌన్లోని రేషన్ బియ్యం నిల్వలను మచిలీపట్నం మార్కెట్ యార్డుకు తరలించారు. గోడౌన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టనున్నట్లు తెలుస్తోంది.
సజ్జల భార్గవరెడ్డికి షాక్ - పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ