Leopard Died in Metlapalli : వన్యప్రాణులు జనవాసాల్లోకి వస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అడవులను నరికి, కొండలను కూల్చేస్తుండటంతో ఆవాసాలు లేక అడవి జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు ప్రాంతాల్లో ప్రజలు, పశువులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఇటీవల ఏపీలో చిరుత, పెద్దపులి, ఏనుగుల సంచారం ఎక్కువయ్యాయి. దీంతో అవి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు పలుచోట్ల జనారణ్యంలోకి వచ్చిన వన్యమృగాలు మృతిచెందడం కలకలం రేపుతోంది.
తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో ఓ చిరుత మృతి కలకలం రేపుతోంది. పందుల నుంచి పొలాలను రక్షించుకునేందుకు పెట్టిన ఉచ్చులో చిక్కుకొని అది మరణించింది. నెల రోజుల క్రితం చిరుత కదలికలను ఓ రైతు గమనించాడు. దాని సంచారంపై చుట్టుపక్కల అన్నదాతలకు సమాచారమిచ్చినా వారు పట్టించుకోలేదు. ఎట్టకేలకు పందుల బారి నుంచి మామిడి తోటను కాపాడుకునేందుకు పన్నిన ఉచ్చులో చిక్కుకొని చిరుత చనిపోయింది. ఉదయాన్నే తోటకు వెళ్లిన కాపలాదారు మల్లేశ్ దానిని గమనించి అటవీశాఖ, పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న అధికారులు వివరాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
"మెట్లపల్లిలోని ఓ మామిడి తోటలో చిరుత మృతి చెందిందని సమాచారం అందింది. ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించాం. బుధవారం సాయంత్రం లేదా రాత్రి ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నాం. గతంలో చిరుత కోళ్లపై దాడి చేసిందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేశాం. బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం." - సురేశ్, ఆత్కూరు ఎస్సై
Leopard Spotted in Addepalli : మరోవైపు శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం ఆదేపల్లిలో చిరుత సంచారం కలకలం రేపింది. ఈ క్రమంలోనే పొలాల్లోని ఆవుపై దాడి చేసింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులకు వారు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు వివరాలను సేకరించారు. చిరుత కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా బయట తిరగవద్దని సూచించారు.
"అదిగో పెద్దపులి.. ఇదిగో చిరుత" - మూడు జిల్లాల ప్రజల్లో భయాందోళన