MAHASHIVRATRI SPECIAL : హిందూ సంప్రదాయంలో ఎన్నో పండుగలున్నాయి. తెలుగు నూతన సంవత్సరం ఉగాదితో మొదలుకుని ఏడాది మొత్తం ఎన్నో పర్వదినాలూ, పండుగలూ వస్తుంటాయి. వాటన్నింట్లో మాసశివరాత్రి ఎంతో ప్రత్యేకమైనది. పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించేందుకు ఉపవాసాలు, జాగారాలు చేస్తుంటారు. అసలు ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటో ఆలోచించారా? పండితులు ఏమంటున్నారో తెలుసుకుందాం పదండి!
శివరాత్రికి చిలగడ దుంపకి లింక్ ఏంటో తెలుసా? - ఆ రోజున ఎందుకు తింటారంటే!

సంవత్సరం అంటే 12 నెలలు. ప్రతి నెలకూ రెండు ఏకాదశి తిథులు వస్తాయి. విష్ణుభక్తులు ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మర్నాడు ఆహారం తీసుకుంటారు. అదేవిధంగా శివభక్తులు మాసశివరాత్రిని పరమ పవిత్రంగా భావించి పరమేశ్వరుడిని ఆరాధిస్తుంటారు. ప్రతి నెలా అమావాస్యకు ముందు వచ్చే బహుళ చతుర్దశి తిథినే మాస శివరాత్రిగా తెలుగు పంచాంగం ప్రకారం పేర్కొంటుంది.

లింగోద్భవ సమయం అంటే!
సంవత్సరంలో పన్నెండు మాస శివరాత్రి తిథులు వస్తే మాఘమాసంలో వచ్చే దానినే మహాశివరాత్రిగా జరుపుతాం. శివపురాణం ఏం చెప్తోందంటే! మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి తిథినాడే పరమేశ్వరుడు జగన్మాతను వివాహమాడాడట. అలాగే ఈ తిథినాడే శివుడు అవతరించాడని చెప్తుంటారు కాబట్టే మహాశివరాత్రి ఎంతో విశిష్టతను సంతరించుకుంది. అందుకే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి, ప్రదోష వేళ పూజిస్తుంటారు. "మహాశివరాత్రి రోజున రాత్రి 11.30 నిమిషాల నుంచి అర్ధరాత్రి 1.00 గంట మధ్య ప్రాంతంలో 'లింగోద్భవ కాలం'లో పూజలు చేయడం వల్ల శివానుగ్రహం కలుగుతుంది" అని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ తెలిపారు.

అమావాస్యకు ముందు కేతువు ప్రభావంతో చంద్రుడు బలహీనంగా ఉండడం వల్ల భూమిమీద ఉన్న జీవులపైన కేతువు ప్రభావం ఉంటుంది. దాంతో ఆహారపు అలవాట్లపైనా ప్రభావం పడి జీర్ణశక్తి తగ్గిపోయి మానసికంగా సంయమనం కోల్పోతారు. ఉద్వేగాలకు లోనుకావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఉపవాసంతో పరమేశ్వరుడిని పూజిస్తే ఇవన్నీ అదుపులో ఉంటాయనీ, రాహుకేతు గ్రహదోషాల ప్రభావం కూడా పడదని భక్తులు నమ్ముతుంటారు. పూజలకు తోడు అన్నదానం, జలదానం, వస్త్రదానం, గోదానం చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి.

లలితా సహస్రం రాసింది వాగ్దేవతలే!
లలితాపరాభట్టారికను వేయి నామాలతో కీర్తించే అత్యంత పవిత్రమైన నామావళిని లలితా సహస్ర నామం అంటారు. . శక్తిస్వరూపిణి అయిన ఆదిపరాశక్తిని కొనియాడే ఈ అద్భుతమైన మంత్రాలు బ్రహ్మాండపురాణంలోని ఒక భాగంగా చేర్చారు. అమ్మవారి శిరస్సు నుంచి పాదాల వరకూ వర్ణించే ఈ సహస్రనామాలివి. ఆదిశక్తి దయ, అందం, కరుణ, సామర్థ్యాలను ఇవి వివరిస్తాయి. పునరావృతం లేకుండా వేయి పేర్లను కలిగి ఉన్న ఏకైక సహస్రనామాలు లలితా సహస్ర నామం మాత్రమేనట. ఇంతటి విశిష్టత కలిగిన ఈ నామాలను అమ్మవారి ఆదేశాల మేరకు ఎనిమిది మంది వాగ్దేవతలు రచించారని చెప్తుంటారు. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని వీటిని స్వయంగా రచించగా హయగ్రీవుడు ఆగస్త్యునికి బోధించాడట.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
10నిమిషాల్లో చిక్కటి గడ్డ పెరుగు - రసాయనాలు లేకుండానే చిన్న చిట్కాతో ఇలా తయారు చేసుకోండి
శివరాత్రికి శ్రీశైలం, రామోజీ ఫిలిం సిటీ సందర్శన - IRCTC సరికొత్త ప్యాకేజీ!