AP Assembly Sessions 2025 : శాసనసభ, మండలి సమావేశాల ఏర్పాట్లపై శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అసెంబ్లీ కార్యదర్శి జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, సీఎస్ జయానంద్, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా పాల్గొన్నారు. గవర్నర్ ప్రసంగం జరిగే రోజు ఉదయం 9:30 గంటలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభకు హాజరవుతారని స్పీకర్ తెలిపారు.
శాసనసభ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇందుకు పోలీసుశాఖకు సహకరించాలని అయ్యన్నపాత్రుడు కోరారు. సమావేశాల సమయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రిని కలిసే సందర్శకులు, ప్రతినిధులు శాసనసభ ప్రాంగణంలో కాకుండా సీఎం కార్యాలయంలోనే భేటీ కావాలని సూచించారు.
AP Budget Sessions 2025 : మరోవైపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమైంది. ఈ మేరకు సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాక సభ వాయిదా పడనుంది. అనంతరం జరిగే శాసనసభ సలహా కమిటీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నడపాలన్నది నిర్ణయించనున్నారు. ఎన్నికల హామీల అమలుకు ప్రాధాన్యమిస్తూ ఈ నెల 28న 2025-2026 వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది. దాదాపు మూడు వారాల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో సర్కార్ ఉనట్లు సమాచారం.
24 అంశాలపై చర్చకు రె'ఢీ' అంటున్న కూటమి - అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి