Ex Minister Srinivas Goud Case :2018 ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు పొందుపరిచారంటూ బీఆర్ఎస్(BRS) మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై కేసు వేసిన పిటిషన్‌ను నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టేసింది. పిటిషన్‌కు విచారణార్హత లేదన్న కోర్టు, హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. 2018 ఎన్నికల సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేశారని, దీనిపై సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదని మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన రాఘవేందర్ రాజు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ నిర్వహించిన కోర్టు, శ్రీనివాస్‌గౌడ్, కేంద్ర ఎన్నికల కమిషన్(CEC), అప్పటి ఎన్నికల అధికారితో కలిపి 11మందిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా తగిన సాక్ష్యాధారాలు లేవని పోలీసులు కోర్టుకు నివేదిక ఇచ్చారు. పోలీసుల నివేదికపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
కవిత ఈడీ కేసు మరోసారి వాయిదా - ఈనెల 28న విచారణ
పిటిషన్‌ను ఎందుకు విచారించాలనే దానిపై వివరణ ఇవ్వాలని ప్రజాప్రతినిధుల కోర్టు, పిటిషనర్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. పిటిషన్ విచారణార్హం కాదని కోర్టు తెలిపింది. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది పలు కోర్టు తీర్పులను ప్రస్తావించారు. వాదనలు ముగిసిన అనంతరం తీర్పును రిజర్వు చేసిన కోర్టు, ఉత్తర్వులను వెలువరించింది. రాఘవేందర్ రాజు వేసిన పిటిషన్‌ను ఈ కోర్టు విచారించే పరిధి లేదని ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పునిచ్చింది. ఏ కోర్టుకు ఆర్హత ఉందనే విషయాన్ని తేల్చుకోవడానికి హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ రాఘవేందర్ రాజుకు సూచించింది.