Ten People Trapped Floods In Nagarkurnool: నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలం సిద్దాపూర్ శివారు దుందుబి వాగులో చేపల వేటకు వెళ్లి 10 మంది చెంచులు చిక్కుకున్నారు. స్థానికుల సమాచారంతో స్పందించిన అచ్చంపేట, దేవరకొండ పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో సురక్షితంగా బయటకు తీశారు. రెండు రోజులుగా ఏమీ తినకపోవడంతో ఆహారం అందించి ఆస్పత్రికి తీసుకెళ్లారు.
నల్గొండ జిల్లా డిండి మండలం గోనబోయినపల్లికి చెందిన జలల్ గురువయ్య, ఆయన భార్య నిరంజనమ్మ, కుమారులు బయ్యన్న, సత్యయ్య, చినపాపయ్య, చిన్న పాపయ్య భార్య యాదమ్మ, వారి ఐదు, మూడేళ్ల కూతుళ్లు అంజలి, అఖిల, కుమారుడు శివ మరో ఏడాది లోపు చిన్నారి వాగులో చిక్కుకున్న వారిలో ఉన్నారు. మూడు రోజుల కిందట చేపల వేట కోసం వెళ్లిన ఆ కుటుంబం, వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో వాగు మధ్యలోని గడ్డకు చేరుకున్నారు.
కానీ రెండు రోజులుగా వాగు ఉద్ధృతి తగ్గకపోవడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. స్థానికులకు సమాచారం చేరవేయగా, అచ్చంపేట పోలీసులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన పోలీసులు అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్, సీఐ రవిందర్, ఎస్సై రాముతో పాటు డిండి ఎస్సై రాజు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు వాగులో చిక్కుకున్న వారిని రక్షించడానికి సోమశిల నుంచి గజ ఈత గాళ్లను రప్పించారు. డ్రోన్ల సాయంతో బాధితులకు ఆహారం అందించారు. చీకటి కావడంతో వారిని వాగు మధ్యలోంచి తీసుకురావడం కష్టంగా మారింది.