Telangana Police Finger Print : తెలంగాణ రాష్ట్రంలో నేరస్థులను పోలీసులు అరెస్టు చేసిన వెంటనే వేలిముద్రలు, అరచేతులను స్కానింగ్ చేసి భద్రపరచడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఇకపై దీనికి అదనంగా ముఖంతో పాటు కళ్లు, అరికాళ్లనూ స్కాన్ చేయనున్నారు. చేతిరాత, ఒడ్డూపొడవు, బరువు, సంతకం లాంటి భౌతిక కొలతలను సైతం సేకరించి భద్రపరచనున్నారు. ఇందు కోసం (అంబిస్) ‘ది ఆటోమేటెడ్ మల్టీమోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్’ను ఉపయోగించనున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారంగా నడిచే ఈ పరిజ్ఞానాన్ని దేశంలో తెలంగాణలోనే తొలిసారిగా వాడనున్నారు. ఆఖరికి అరికాలి ముద్రల్ని సేకరించి భద్రపరుస్తున్న తొలి రాష్ట్రమూ మనదే. క్రిమినల్ ప్రొసీజర్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ చట్టం-2022 ఆధారంగా అధికారికంగానే ఈ వివరాలను సేకరించనున్నారు. అలాగే పాస్‌పోర్టు/ఉద్యోగ దరఖాస్తుదారుల వెరిఫికేషన్‌కు మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్(ఎంఎస్‌సీడీ)ను వినియోగించనున్నారు.
ఐదు పోలీస్ స్టేషన్లలో ప్రయోగాత్మకంగా అమలు :తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలోని సీఐడీ ఫింగర్ ప్రింట్ విభాగం ప్రస్తుతం ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్(అఫిస్) టెక్నాలజీనే వాడుతోంది. ఇందులో సుమారు 11 లక్షల మంది నేరస్థుల వేలిముద్రల సమాచారం(డేటాబేస్) ఉంది. దేశవ్యాప్తంగా 16 వేలకు పైగా పోలీసుస్టేషన్లను కనెక్ట్ చేసే క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్‌వర్క్ ట్రాకింగ్ సిస్టమ్(సీసీఎన్‌టీఎస్)తో ఈ డేటాను షేర్ చేసుకుంటున్నారు. ఇకపై అఫిస్ పరిజ్ఞానాన్ని అంబిస్ టెక్నాలజీతో భర్తీ చేయనున్నారు.
ఇందులో అదనంగా కంప్యూటర్ టర్మినల్, ఫింగర్ ప్రింట్, పామ్ స్కానర్, కెమెరా, ఐరిస్‌లు ఉంటాయి. నేరం చేసే సమయంలో దుండగులు మొహానికి మాస్క్, చేతులకు గ్లౌజులు ధరించినా ఒడ్డూపొడవు ఆధారంగా వారిని కొద్ది కాలంలోనే గుర్తించగలరు. ఈ తరహా న్యూరల్ నెట్‌వర్క్ టెక్నాలజీని మన మిత్ర దేశమైన రష్యాలో వినియోగిస్తున్నారు. దీంతో తెలంగాణ ఫింగర్ ప్రింట్ విభాగానికి చెందిన పోలీసులు రష్యన్ నిపుణుల నుంచి శిక్షణ పొందారు. ఇప్పటికే ఎల్‌బీనగర్, హనుమకొండ, పంజాగుట్ట, మాదాపూర్, సిద్దిపేట ఠాణాల్లో ప్రయోగాత్మకంగా ఈ టెక్నాలజీని వాడుతున్నారు. 2025లో మరిన్ని పోలీస్ స్టేషన్లకు విస్తరించాలని నిర్ణయించారు.
రియల్‌టైంలో డేటాను పంచుకునే అవకాశం :వేలిముద్రలు కాగితాల నుంచి డిజిటల్‌లోకి మారిన తరువాత రాష్ట్రాల డేటాబేస్‌లను ఒక దానితో ఒకటి పోల్చి చూసి ఫలితాలను తెలుసుకోవడం చాలావరకు సులువుగా సౌకర్యంగా మారింది. ఇప్పుడు కొత్త టెక్నాలజీతో వేలిముద్రలతోపాటు ఇతర ఆధారాలనూ సేకరించేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. దీని ద్వారా ఒక రాష్ట్రంలో దొరికిన నేరగాడి డేటాను రియల్‌టైంలో ఇతర రాష్ట్రాల్లోని నేర రికార్డులతో పోల్చి చూసుకునే అవకాశం లభించనుంది. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసులు రియల్‌టైంలో (నఫిస్) నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌తోపాటు మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో ఈ డేటాను పంచుకోనున్నారు.
ఫింగర్ ప్రింట్, ఐరిస్‌తో కాదు- ఇక శ్వాసతోనే ఫోన్ అన్ లాక్! ఈ టెక్నాలజీ అదుర్స్
పోలీసుల కొత్త టెక్నాలజీ... నేరస్థుల చిట్టా ఇక క్షణాల్లోనే!