Mothers Day Special Story 2024 : ఏ అమ్మకైనా బిడ్డను చూస్తే గర్వంగా అనిపిస్తుంది. నాకు నా పాపని చూస్తే, రెట్టింపు గర్వంగా ఉందని ఆ మాతృమూర్తి అంటోంది. ఎందుకంటే ఆ చిన్నారి తనకున్న సమస్యని జయించి క్రీడాకారిణిగా, చిత్రకారిణిగా ఎదిగింది మరి. ఈ క్రమంలో తన సాయం కొంతే అయితే మా అమ్మాయి పట్టుదలే ఎక్కువని చెబుతోంది అరుణ భాస్కర్. అలా కుమార్తెను ఛాంపియన్‌గా మార్చింది. మరి ఆ విజయగాథ గురించిన మరిన్ని విషయాలు మనమూ తెలుసుకుందామా?
అరుణ భాస్కర్‌ది గుంటూరు. ఆమెకు ఆటలంటే ఎంతో ఇష్టం. చదువుకుంటూనే వాలీబాల్, కబడ్డీల్లో రాష్ట్రస్థాయి పోటీలవరకూ వెళ్లారు. వివాహం కావడంతో ఆటలకు గుడ్‌బై చెప్పారు. అరుణ భర్త విజయ్‌భాస్కర్ డిఫెన్స్‌లో అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఉద్యోగరీత్యా పదేళ్లపాటు అండమాన్, షిల్లాంగ్‌ల్లో ఉన్నారు. మొదట వీరికి బాబు పుట్టాడు. పేరు విజయ్‌తేజ్. ఆ తర్వాత పాప. అమ్మాయి కడుపులో ఉన్నప్పుడే స్కానింగ్‌లో కాళ్లలో ఏదో ఒక వంకర ఉందని వైద్యులు గమనించారు.
ఆ చిన్నారికి బ్రిటెల్ బోన్ డిసీజ్ : దీంతో ఆర్థోపెడిక్ డాక్టర్‌ని దగ్గర పెట్టుకుని, అరుణ భాస్కర్‌కు సిజేరియన్ చేశారు. అంత జాగ్రత్త పడినా, బయటకు తీసేప్పుడు రెండు కాళ్లూ ఫ్రాక్చర్ అయ్యాయి. రెండు రోజులయ్యాక ఆ చిన్నారికి బ్రిటెల్ బోన్ డిసీజ్ ఉందని అసలు విషయం తెలిసింది. ఈ సమస్య ఉన్నవాళ్లకి, సుద్ద ఎలా విరుగుతుంది? అలా చిన్నపాటి గాయాలకే ఎముకలు విరిగిపోయి, పిండిలా అయిపోతాయి. దీంతో దంపతులిద్దరూ కుమిలిపోయారు.
Mother's Day Special 2023 : ఒంటి చేత్తో అన్నింటినీ చక్కబెట్టే అమ్మ.. ఒక యోధ
అరుణ భాస్కర్ పాలివ్వడం కోసం తన పాపను అటూ, ఇటూ మార్చినా చేయివిరిగేది. పాకుతూ పాకుతూ పడిపోయి కాళ్లూ, చేతులకు ఫ్రాక్చర్లు అయ్యేవి. శరీరాన్ని తడిమిచూస్తే ఎక్కడో వాపు కనిపించేది. అది ఫ్రాక్చర్ అన్నమాట. దానికి ఒక బట్టముక్క చుట్టేవాళ్లు. అంతకుమించి వైద్యం లేదా అంటే? ఏడాదిన్నర వయసులో ఒకసారి ప్రయత్నించారు. ఎముకల్లో పట్టులేదని సర్జరీ మధ్యలో ఆపేశారు. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా నడుస్తూ నడుస్తూ పడిపోయేది. అలా 45 సార్లు ఫ్రాక్చర్లు అయ్యాయి.