A Son died Due to Kidney Issue : ఆ దంపతులకు వరుసగా ముగ్గురు కుమార్తెలు. తర్వాతి సంతానంలో కుమారుడు జన్మించాడు. ఆ కుర్రాడిని ఆ తల్లి అల్లారు ముద్దుగా పెంచి పోషించింది. అనంతరం యుక్త వయస్సుకు రాగానే వివాహం జరిపించారు. ప్రస్తుతం ఆ యువకుడికి భార్య, తొమ్మిదేళ్ల కుమారుడు, అయిదేళ్ల కూతురు ఉన్నారు. సాఫీగా సాగిపోతున్న జీవితాన్ని ఒక్క సారిగా కిడ్నీ సంబంధిత వ్యాధి కుదిపేసింది. తనయుడి అనారోగ్యాన్ని చూసి తట్టుకోలేక ఆ తల్లి తల్లడిల్లిపోయింది. డాక్టర్లు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయాలన్నారు. వెంటనే కొడుకు కంటే తనకేదీ ఎక్కువ కాదనుకొని, అతడి జీవితాన్ని నిలబెట్టేందుకు తన కిడ్నీని సైతం దానం చేసింది తల్లి సత్తెమ్మ.
కిడ్నీ దానం చేసిన తల్లి : చికిత్స చేసిన అనంతరం కుమారుడు ఏడాదిపాటు బాగానే ఉన్నాడు. అతడు తర్వాత మళ్లీ అనారోగ్యానికి గురయ్యాడు. ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేక మృతి చెందాడు. కొడుకు మరణం తట్టుకోలేని తల్లి, భార్యాపిల్లలు దుఃఖ సాగరంలో మునిగారు. స్థానికుల కథనం ప్రకారం కరీంనగర్ జిల్లాలోని పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామానికి చెందిన లక్ష్మయ్య, సత్తెమ్మ దంపతుల కుమారుడు రాము (35). రాము కిడ్నీ సంబంధిత వ్యాధికి గురయ్యారు. ఆ మధ్యలో డయాలసిస్‌తో కొంత ఉపశమనం పొందారు. ఆ తర్వాత కిడ్నీ మార్పిడి చేయించుకోవాలని వైద్యులు సూచించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారు అంతంత మాత్రంగానే ఉన్నారు. దీంతో తల్లి సత్తెమ్మ తన కిడ్నీని కొడుకుకు దానం చేసింది.