Most Police Officers From Kulkacharla Village : విభిన్న జాతులు, వృత్తులు, ఉద్యోగాలు చేస్తున్న వారితో గ్రామాలు, కాలనీలు కొనసాగుతుంటాయి. ఫలానా గ్రామంలో అందరూ వ్యవసాయం మీద ఆధారపడ్డవారే. ఆ ప్రాంతంలో అందరూ అదే వృత్తి చేస్తారంట అని చెబుతుంటారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ఇప్పాయిపల్లి, రాంపూర్ గ్రామానికి ఇలాంటి ఓ పేరే ఉంది. ఈ ఊళ్లలో ఏకంగా వందమందికి పైగా పోలీసు ఉద్యోగాలు చేస్తున్నావారే ఉన్నారు. ఒకరిని స్ఫూర్తిగా తీసుకుని మరొకరు ఖాకీ ఉద్యోగ వేటలో పడుతున్నారు. కొన్ని కుటుంబాల్లో అయితే అన్నదమ్ములు కూడా ఒకే రకరమైన ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ రకంగా ఆ గ్రామానికి పోలీసు గ్రామం అనే పిలుపు వచ్చినట్లయింది. ఈ పోలీస్ విలేజ్‌పై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
జీవితం మార్చిన వాలిబాల్ :రాంపుల్, ఇప్పాయిపల్లి గ్రామాల్లో 50 సంవత్సరాల క్రితం స్థానిక క్రీడాకారులు నర్సయ్య, బుగ్గోజీ, చంద్రమౌళి, చందులాల్, నర్సింలు వాలిబాల్ ఆడటాన్ని ప్రారంభించారు. క్రమంగా వారి తరువాతి తరం వారు పాల్గొనేలా ప్రోత్సహించారు. ఆటపై మక్కువ పెంచుకున్న వారు మంచి ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నారు. శారీరంగా దృఢత్వాన్ని పొందుతున్న వారికి పోలీసు ఉద్యోగాలను సులువుగా పొందేలా చేసింది. ఈ ఆటకు స్థానికులే సొంతంగా స్థలాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీంతో వారికి సాధన చేయడం సులువైంది.
"పోలీసు ఉద్యోగాల్లో ఉన్న మా సీనియర్లను స్ఫూర్తిగా తీసుకొని మేం పోలీసు ఉద్యోగాన్ని పొందాం. మా తర్వాతి వారు కూడా అదే బాటలో రాణిస్తున్నారు. నియామకాల సమయంలో తగిన సూచనలను అందిస్తున్నాం." - రాంజీ, ఏఎస్‌ఐ