Dental Problems in Old Age :వృద్ధాప్యంలో వివిధ ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అందులో ఒకటి దంత సమస్యలు. ముసలితనంలో ఈ సమస్య తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతుందని సీనియర్ దంత వైద్య నిపుణులు డాక్టర్ వికాస్ గౌడ్ అన్నారు. దేశంలో 65 ఏళ్లు దాటిన వారిలో పూర్తిగా దంతాలు కోల్పోయే వారు సుమారు 30 శాతం నుంచి 40 శాతం మంది వరకు ఉంటారని తెలిపారు. నోటి ఆరోగ్య సంరక్షణను నిర్లక్ష్యం చేస్తే దంతాలు త్వరగా ఊడిపోతాయని చెప్పారు. వృద్ధాప్యంలో ఎదురవుతున్న దంత సమస్యలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
ఇటీవల బెంగళూరులో జరిగిన ‘నోబల్ ఎక్సలెన్స్ ఇన్ ఇంప్లాంటాలజీ’ సదస్సులో వికాస్ గౌడ్ మాట్లాడారు. 'సాధారణంగా ఎక్కువ మంది దంత సమస్యలను తేలిగ్గా తీసుకుంటారని, నోటి శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వరని తెలిపారు. దీంతో వయసు పైబడుతున్న కొద్దీ దంతాలు ఊడిపోతుంటాయని వివరించారు. ఆహారాన్ని సరిగ్గా నమిలి తినలేరని, దానివల్ల ముఖంలోనూ మార్పులు కనిపిస్తాయన్నారు. ఈ సమస్యలన్నింటికీ ఇప్పుడున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కృత్రిమ దంతాలను అమర్చవచ్చని తెలపారు. కట్టుడు దంతాల మాదిరిగా కాకుండా, ఇప్పుడొస్తున్న అధునాతన ఇంప్లాంట్లు సహజ సిద్ధంగా అమరుతాయని వివరించారు. వృద్ధుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేయొచ్చని అన్నారు. జీవన నాణ్యత కూడా పెరుగుతుందన్న ఆయన, ఈ విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
మీ పిల్లల్లో దంత సమస్యలా? ఈ టిప్స్ క్యావిటీస్, ఇన్ఫెక్షన్లు నుంచి రిలీఫ్! - Child Dental Care Tips