Karimnagar Dhobi Ghat Project :స్మార్ట్ సిటీ పథకం నిధులతో కరీంనగర్‌లో నిర్మించిన ఆధునిక దోబీఘాట్లను సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రారంభోత్సవం రోజు జనరేట్‌తో నడిపించి, మమ అనిపించిన అధికారులు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలనే విషయాన్నే మరిచిపోయారు. ఫలితంగా ఏడాది నుంచి రజకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత వాటిని కూల్చేయడం, కొత్త దోబీఘాట్లకు కరెంట్ సరఫరా చేయకపోవడంతో, రెంటికి చెడ్డ రేవడిలా వారి పరిస్థితి తయారైంది.
రజకుల కులవృత్తికి ఆధునిక హంగులు జోడించి, వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా 142 ఆధునిక దోబీ ఘాట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కరీంనగర్‌లో మూడు మోడ్రన్ దోబీ ఘాట్లను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుని, తొలి విడతలో 'గోదాం గడ్డ' వద్ద అత్యాధునిక సాంతికతతో కూడిన వాషింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు. ఈ వాషింగ్ మిషన్లు ఒకే విడతలో 1920 దుస్తులు ఉతికే సామర్థ్యం కలిగి ఉన్నాయి.
సిరిసిల్లలో మోడ్రన్ ధోబీఘాట్.. ఆధునిక సొబగులు దిద్దుకుంటున్న రజక వృత్తి
వాషింగ్ మిషన్ల నుంచి వచ్చే వృథా నీటిని తొలగించేందుకు మూడు యంత్రాలను ఏర్పాటు చేశారు. రెండు డ్రయ్యర్లు, ఒక ఎలక్ట్రికల్ స్ట్రీమ్ రోలర్, రెండు టేబుల్ బాయిలర్లు, రెండు ఐరన్ టేబుళ్లు, మూడు ట్రాలీలు అందుబాటులోకి తెచ్చారు. గంటకు 2 వేల దుస్తులు ఉతికేలా సౌకర్యాలు కల్పించారు. 60 మంది రజకులు పనులు చేసుకునేందుకు వీలుగా కల్పించారు. ఇవన్నీ చేసి ఆధునిక దోబీఘాట్‌కు కరెంట్ కనెక్షన్ ఇవ్వడం మరిచిపోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆధునిక యంత్రాలు నిరుపయోగంగా మారాయి. కరెంట్ సరఫరా కోసం రూ.17 లక్షలు చెల్లించినా, విద్యుత్ అధికారులు ఇంతవరకు కనెక్షన్ ఇవ్వలేదని కరీంనగర్ మేయర్ సునీల్‌రావు తెలిపారు. జనరేటర్ ద్వారా యంత్రాలను నడిపించాలంటే ఆర్థికంగా పెనుభారం పడుతుందని విద్యుత్ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రజకులు కోరుతున్నారు.
'రాష్ట్రం ఏర్పడక ముందు బట్టలు ఉతికేందుకు రజకులకు నీళ్లు ఉండేవి కాదు. ఉన్న వాటితోనే బట్టలు ఉతికితే, ఆ నీటిలో జలగలు, కలుషితమైన నీరు వీటి వల్ల వ్యాధులు వచ్చేవి. దీనివల్ల రజక వృత్తి చేసిన ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడేవారు. సంపాదించింది అంతా ఆస్పత్రి ఖర్చులకే వెళ్లిపోయేది. ఒక రోజుకు 2500 బట్టలు ఉతికి, ఇస్త్రీ చేసే సామర్థ్యం ఉన్న అధునాతన మిషనరీని ఏర్పాటు చేశామని ప్రారంభోత్సవం సందర్భంగా చెప్పారు. అయితే దీనికి అవసరమైన విద్యుత్ కనెక్షన్ కోసం రూ.17 లక్షలు చెల్లించినా ఇంతరవకు కనెక్షన్ మాత్రం ఇవ్వలేదు.'- వరికోలు శ్రీనివాస్, కరీంనగర్ రజక సంక్షేమ సంఘం అధ్యక్షుడు
'దళిత, గిరిజన బంధు మాదిరిగా రజక బంధు ఏర్పాటు చేయాలి'