MLA Adinarayana meet CM Chandrababu:వైఎస్సార్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్(Rayalaseema Thermal Power Plant) ఫ్లైయాష్ వివాదం సచివాలయానికి చేరింది. సీఎం చంద్రబాబు పిలుపుతో జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డి సచివాలయానికి వచ్చి సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. జ్వరం వల్ల రాలేనని జేసీ ప్రభాకర్‌రెడ్డి సమాచారం అందించారు. ఫ్లైయాష్ కాంట్రాక్టులో నేతల మధ్య వివాదం కారణంగా కూటమి ప్రతిష్ట దెబ్బతింటుందని ఇప్పటికే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికులకు ఉపాధి కలిగించేందుకే తీసుకెళ్తున్నాము: ఆర్టీపీపీ నుంచి వచ్చే ఫ్లైయాష్ ఉచితమని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి(MLA Adinarayana Reddy) అన్నారు. స్థానికులకు ఉపాధి కలిగించేందుకు ఈ బూడిదను తీసుకు వెళ్తున్నామని చెప్పారు. ఈ అంశాలపై సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వచ్చి వివరణ ఇచ్చామని ఎమ్మెల్యే తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) మాత్రం పెద్ద లేఖ రాశారని, లెటర్ రాసిన వారు స్వయంగా రావాలి కదా అని అన్నారు. స్ధానికుల తరవాతే ఇతరులకు ఇవ్వాలని సీఎం కు చెప్పినట్లు ఆదినారాయణరెడ్డి వెల్లడించారు. పోలీసు, రెవెన్యూ, ఇంటెలిజెన్స్ అందరి నుంచి వివరాలు తెలుసుకుని వివాదాన్ని సీఎం చంద్రబాబు పరిష్కరిస్తారని చెప్పారని ఎమ్మెల్యే తెలిపారు.