WHAT HAPPENED IN TIRUPATI INCIDENT: తిరుమల శ్రీవారిని వైకుంఠ ఏకాదశి రోజు దర్శించుకోవాలని టోకెన్లు తీసుకునేలోపే వారు మృత్యుఒడిలోకి వెళ్లిపోయారు. గతంలో ఎన్నడూ లేని చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం 10 గంటలకు వచ్చిన భక్తులు రాత్రి 10 వరకూ నిరీక్షించారు. ఇంతకీ ఈ 12 గంటల వ్యవధిలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
అక్కడైతే భక్తుల తాకిడి తక్కువగా ఉంటుందని: బైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూల్ వద్ద భక్తుల తాకిడి తక్కువగా ఉంటుందని భావించిన యాత్రికులు బుధవారం ఉదయం 10 గంటలకే అక్కడకు చేరుకున్నారు. దీంతో రాత్రికి పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోవడంతో పక్కనే ఉన్న శ్రీపద్మావతి పార్కులోకి భక్తులను కూర్చోబెట్టారు. అక్కడ నుంచి రాత్రి 8.20 గంటలకు క్యూలైన్లలోకి అనుమతించారు. ఈ సమయంలో పలువురు భక్తులు తోపులాటలో కిందపడిపోయారు. వెంటనే భక్తులను క్యూలైన్లలోకి అనుమతించకుండా నిలిపివేసిన అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు.
ధీమానే కొంపముంచిందా?: తిరుపతిలోని పలు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే బైరాగిపట్టెడలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. కౌంటర్ వద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న డీఎస్పీ రమణకుమార్‌కు బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు చెప్పినట్లు సమాచారం. అయితే ఏ ప్రమాదం జరగదులే అనే ధీమాతో బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడంతో పాటు, భక్తులను పార్కులో ఉంచి వారందరినీ ఒకేసారి అనుమతించడంతోనే పలువురు మృతి చెందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారం రోజుల నుంచి టోకెన్ల జారీ కేంద్రాలను టీటీడీ, పోలీసులు పరిశీలించి ఏర్పాట్లపై చర్చించారు. అయితే అమలు చేయడంలో ఘోరంగా విఫలమైనట్లు భక్తులు అభిప్రాయపడుతున్నారు.
తిరుపతి తొక్కిసలాట ఘటన - ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఏ సమయానికి ఏం జరిగిందంటే?:
- ఉదయం 10 గంటలకు - రామానాయుడు హైస్కూల్ కౌంటర్ వద్ద భక్తుల తాకిడి పెరిగింది. శ్రీపద్మావతి పార్కులోకి అనుమతించారు.
- మధ్యాహ్నం 2 గంటలకు - భక్తులతో పార్కు నిండింది. భక్తులను అదుపు చేసేందుకు భారీగా పార్కు వద్దకు పోలీసులు చేరుకున్నారు.
- రాత్రి 7 గంటలకు - పార్కు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు ఎటూ కదలలేని పరిస్థితి నెలకొంది. భక్తులకు తాగునీరు అందించారు.
- రాత్రి 8:20 గంటలకు - భారీగా భక్తుల రద్దీ పెరిగింది. పార్కు నుంచి టికెట్ల జారీ కౌంటర్‌లోకి భక్తులను అనుమతించారు. ఈ క్రమంలో భక్తుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పలువురు కింద పడిపోగా, వారిపై నుంచి మరికొంతమంది భక్తులు పరుగులు తీశారు. దీంతో ప్రాణాపాయం చోటు చేసుకుంది.
- రాత్రి 8:40 గంటలకు - ఘటన స్థలానికి అంబులెన్స్‌లు చేరుకున్నాయి. రుయా, స్విమ్స్ ఆస్పత్రులకు గాయపడిన భక్తుల తరలించారు. ఎస్పీ సుబ్బరాయుడు వెంటనే అక్కడి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
- రాత్రి 9:27 గంటలకు - టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈవో వీరబ్రహ్మం ఘటనా స్థలానికి చేరుకుని పోలీసు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
- రాత్రి 9:30 గంటలకు - పార్కులోని భక్తులందరినీ క్యూ పద్ధతిలో కౌంటర్‌లోని క్యూలైన్లలోకి విడిచిపెట్టారు.
అక్కడ ప్లాన్ వర్కౌట్ అయింది: అయితే టోకెన్ల జారీ విషయంలో జీవకోనలోని సత్యనారాయణపురం సెంటర్లో తోపులాట జరిగింది. అయితే ఘటన జరిగిన వెంటనే పోలీసులు సమస్యను గుర్తించారు. టీటీడీ యంత్రాంగం అప్రమత్తమైంది. ఒకసారికి 500 మంది భక్తులను క్యూలోకి అనుమతించారు. ఈలోపు ఎస్పీ సుబ్బారాయుడు అక్కడకు చేరుకొని పలు సూచనలు చేశారు. దీంతో ఎలాంటి తోపులాటలు లేకుండా భక్తులందరూ క్యూలోకి చేరుకున్నారు.
తిరుపతి ఘటనపై మోదీ, రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి - అధికారులపై సీఎం ఆగ్రహం