ED investigation On Kakinada Sea Port And Sez Frauds : కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌ల్లో రూ.3,600 కోట్ల విలువైన వాటాలను బెదిరించి, భయపెట్టి బలవంతంగా లాగేసుకునేందుకు నాటి ముఖ్యమంత్రి జగన్ కుట్ర రూపొందించారని KSPL(Kakinada Sea Ports Limited) పూర్వ యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు ఈడీ అధికారులకు వాంగ్మూలమిచ్చారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి, అరబిందో యజమాని శరత్‌చంద్రారెడ్డి దాన్ని అమలు చేశారని తెలిపారు. జగన్ కోసమే అరబిందో పేరిట ఈ వాటాలన్నీ బదలాయించుకుంటున్నట్లు విక్రాంత్‌రెడ్డి తనతో స్పష్టంగా చెప్పారని వివరించారు.
శరత్‌చంద్రారెడ్డి, విక్రాంత్‌రెడ్డిలతో వెళ్లి జగన్‌ను తాను కలిసిన సందర్భంలో వాటాల బదలాయింపు అంతా జగన్ కోసమే జరుగుతోందనే విషయం తనకు స్పష్టంగా తేటతెల్లమైందని కేవీ రావు చెప్పారు. KSPL, కాకినాడ సెజ్‌ల్లోని వాటాలు బలవంతంగా లాగేసుకున్నారంటూ ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో ఫిర్యాదుదారైన కేవీ రావును ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని కార్యాలయంలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ విచారించారు. అప్పట్లో ఏం జరిగిందనేదానిపై ఆయన్ను ప్రశ్నించారు. ఫిర్యాదులోని అంశాలన్నింటిపైనా మరింత లోతుగా అడిగారు. కేవీ రావు చెప్పిన సమాధానాలన్నింటినీ రికార్డు చేసిన ఈడీ అధికారులు ఆయన వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.
ఆ డబ్బులు ఎక్కడివి? ఎవరివి?- దూకుడు పెంచిన ఈడీ
2020 మే నెలలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్ చేసి.. కాకినాడ సీ పోర్ట్ వ్యవహారంపై విక్రాంత్‌రెడ్డి, శరత్‌చంద్రారెడ్డిలను కలవమన్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారంటూ కేవీ రావు వద్ద ఈడీ అధికారులు ప్రస్తావించారు. కానీ కేవీరావుతో పరిచయమే లేదంటూ విజయసాయిరెడ్డి విచారణలో చెప్పారని, అసలు ఆ రోజు ఏం జరిగింది అంటూ ఈడీ అధికారులు కేవీ రావును ప్రశ్నించారు. అయితే విజయసాయిరెడ్డి ఒత్తిడి వల్లే తాను విక్రాంత్‌రెడ్డి, శరత్‌చంద్రారెడ్డిని కలిశానని కేవీరావు చెప్పినట్లు సమాచారం. వాటాల బదలాయింపు పత్రాలపై ఎందుకు సంతకం పెట్టాల్సి వచ్చిందని ఈడీ అధికారులు ప్రశ్నించగా అందుకు సమ్మతించకపోతే తనపైనా, తన కుటుంబంలోని మహిళపైనా అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడతామంటూ విక్రాంత్‌రెడ్డి బెదిరించారని కేవీ రావు జవాబిచ్చినట్లు తెలిసింది. ఎంత మొత్తానికి వాటాలు కొంటున్నారనే విషయం లేకుండానే తనతో కొనుగోలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించుకున్నారంటూ ఆయన ఈడీ ఎదుట వాపోయినట్లు సమాచారం.
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక KSPLకు సహకారం కొరవడిందన్న కేవీ రావు.. టేకోవర్ చేస్తారని ప్రచారం జరిగిందన్నారు. అందులో భాగంగానే KSPLలో PKF శ్రీధర్ అండ్ సంతానం LLPతో స్పెషల్ ఆడిట్ చేయించారన్నారు. లేని ఆదాయం ఉన్నట్లు తప్పుడు దస్త్రాలు సృష్టించారన్నారు. KSPL ప్రభుత్వానికి రూ.965.65 కోట్లు చెల్లించాలంటూ తప్పుడు నివేదిక ఇప్పించారన్నారు. దాన్ని అడ్డం పెట్టుకుని తనను బెదిరించి, మోసపూరితంగా సంతకాలు చేయించుకున్నారు అంటూ ఈడీకి కేవీ రావు వివరించారు. వాటాలన్నీ అరబిందో పరమయ్యాక అంతకు ముందు ఆడిట్ నివేదికలో పేర్కొన్న రూ.965.65 కోట్లను రూ.9.03 కోట్లకు కుదించేశారని కేవీ రావు ఈడీకి చెప్పారు.
జగన్ మరో దాష్టీకం వెలుగులోకి - రాక్షస రాజకీయంతో కాకినాడ పోర్టు అరబిందో పరం!
వాటాల కొనుగోలు కోసం అరబిందో సంస్థ చెల్లించిన రూ.494 కోట్లు ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు? ఎప్పుడెప్పుడు ఇచ్చారు? ఎలా ఇచ్చారు?’ అని కేవీ రావును ప్రశ్నించగా తొలుత కార్పొరేట్ డిపాజిట్ అగ్రిమెంట్ కింద రూ.100 కోట్లు ఇచ్చారని, ఆ తర్వాత 2021 ఫిబ్రవరిలో మిగతా రూ.394 కోట్లు చెల్లించారని ఆయన చెప్పారు. అరబిందో పేరిట వాటాల బదిలీ జరిగిన తర్వాత 2020-21, 2021-22, 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ఆ కంపెనీ డివిడెండ్ కింద రూ.102 కోట్లు పొందిందన్నారు. అరబిందో గ్రూపుల్లోని వేర్వేరు కంపెనీలకు కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ రూ.280 కోట్లు ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్ల కింద చెల్లించింది అని కేవీ రావు చెప్పారు. దీనిలోని మనీలాండరింగ్ అంశాలపై ఈడీ అధికారులు ఆయన నుంచి కొంత సమాచారం రాబట్టినట్లు తెలిసింది.
కేవీ రావు ఎవరో తెలియదు - ఆరోపణలు తప్పని తేలాక పరువునష్టం దావా వేస్తా: విజయసాయి రెడ్డి