Mysore Tomato Rasam in Telugu : వేసవి కాలంలో చాలా మందికి భోజనంలోకి రసం, సాంబార్ వంటివి తప్పక ఉండాల్సిందే. ఈ క్రమంలోనే ఇంట్లో టమాటా రసం, మిరియాల రసం, పప్పుచారు ఎక్కువగా చేస్తుంటారు. అయితే, ఇవన్నీ ఎప్పుడూ తినేవే! అలా కాకుండా ఓసారి ఈ స్టోరీలో చెప్పిన విధంగా మైసూర్ స్టైల్ టమాటా రసం ప్రిపేర్ చేయండి. వేడివేడి అన్నంలో ఈ టమాటా రసం ఎంతో బాగుంటుంది. మరి సులభంగా మైసూర్ స్టైల్ టమాటా రసం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- కందిపప్పు - అరకప్పు
- టమాటాలు - 4
- పచ్చిమిర్చి - 4
- బెల్లం- టేబుల్‌స్పూన్
- చింతపండు - నిమ్మకాయసైజంత
- కరివేపాకు - 2
- పసుపు - పావు టీస్పూన్
- నూనె - సరిపడా
- ఉప్పు - రుచికి సరిపడా
- కొద్దిగా కొత్తిమీర తరుగు
రసం పొడి కోసం :
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- పచ్చికొబ్బరి - పావుకప్పు
- మిరియాలు - టీస్పూన్
- బ్యాడిగి మిర్చి-3
- ధనియాలు - టేబుల్‌స్పూన్
- పచ్చిశనగపప్పు- టేబుల్‌స్పూన్
- జీలకర్ర - అర టీస్పూన్
తాలింపు కోసం :
- నెయ్యి - టేబుల్‌స్పూన్
- జీలకర్ర - టీస్పూన్
- ఆవాలు - టీస్పూన్
- ఎండుమిర్చి - 2
- ఇంగువ - అరటీస్పూన్
శివరాత్రి ఎందుకంత స్పెషల్? - ఆ రోజు విశేషం ఏంటో ఆలోచించారా!
తయారీ విధానం :
- ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి ఒక అరగంటపాటు నీటిలో నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు కుక్కర్లో కందిపప్పు వేసుకుని సరిపడా నీళ్లు పోసి సన్నని మంటమీద రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి.
- ఆపై పప్పుని మెత్తగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి నూనె వేసి వేడి చేయండి. ఇందులో బ్యాడిగి మిర్చి, పచ్చిశనగపప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి.
- కాసేపటి తర్వాత పచ్చికొబ్బరి తరుము వేసి సన్నని మంట మీద మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలి.
- ఇక్కడ మీకు అచ్చం మైసూర్ స్టైల్ రసం టేస్ట్ రావాలంటే కచ్చితంగా బ్యాడిగి మిర్చినే వాడాలి. ఇవి సూపర్ మార్కెట్, ఆన్లైన్లో లభిస్తాయి. ఒకవేళ మీ దగ్గర బ్యాడిగి మిర్చి లేకపోతే ఎండుమిర్చిలను ఉపయోగించుకోవచ్చు.
- మసాలా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు ఓ మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి కట్ చేసిన టమాటా ముక్కలు, కొద్దిగా ఉప్పు, బెల్లం, పసుపు వేసుకుని మెత్తగా చిదుముకోవాలి. టమాటాలలోని సారం మొత్తం వచ్చేంత వరకు చేతితో మెదుపుకుంటే రుచి బాగుంటుంది.
- ఆపై ఇందులోకి నీటిలో నానబెట్టిన చింతపండు, కరివేపాకులు వేసుకుని మరొకసారి మెదుపుకోవాలి.
- అనంతరం టమాటా రసాన్ని ఓ పెద్ద గిన్నెలోకి తీసుకోండి. ఇందులో లీటర్ నీళ్లు పోయండి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసి సన్నని మంట మీద రసం ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించండి.
- చిక్కగా మరుగుతున్న టమాటా రసంలో ఉడికించిన పప్పు, గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసి కలపండి. అలాగే కొత్తిమీర తరుగు వేసి హై ఫ్లేమ్ మీద మరో నాలుగు నిమిషాలు మరిగించాలి.
- ఇప్పుడు సన్నని మంట మీద రసాన్ని మరిగించుకోవాలి.
- టమాటా రసం చిక్కబడే సమయంలోనే తాళింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టండి.
- ఇందులో నెయ్యి కరిగించండి. వేడివేడి నెయ్యిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
- దోరగా వేగిన తాళింపును మరుగుతున్న రసంలో వేసి మరో పొంగు వచ్చే వరకు మరిగించుకోండి. ఆపై స్టవ్ ఆఫ్ చేస్తే సరి. అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే ఘుమఘుమలాడే మైసూర్ రసం రెడీ.
- టమాటా రసం ఎప్పుడూ ఒకేలా కాకుండా ఓసారి ఇలా ఇంట్లో ట్రై చేయండి.
శివరాత్రికి ఎవరైనా ఉపవాసం ఉండొచ్చా? - ఫాస్టింగ్‌తో కలిగే ప్రయోజనాలు తెలుసా?
పేరుకే భిక్షపతి దివ్యాభరణాలకు అధిపతి - మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక అలంకరణ!