Kotappakonda Ekadashi Celebrations : కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి దేవాలయంలో ఘనంగా ఏకాదశి వేడుకలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పొటెత్తారు. శివ నామస్మరణతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. వేకువజామునుంచే కొండకు చేరుకుని నాగులపుట్ట వద్ద మహిళలు దీపాలు వెలిగించి భక్తిని చాటుకున్నారు. దీంతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈ సందర్భంగా శ్రీ త్రికోటేశ్వరస్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు.
"ఏకాదశి సందర్భంగా శ్రీ త్రికోటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించాం. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. వారికి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు." - అప్పయ్య గురుకుల్, ఆలయ ప్రధాన అర్చకులు
మరోవైపు మహా శివరాత్రి వేడుకలకు కోటప్పకొండ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. లక్షలాది మంది తరలివచ్చే ఈ తిరునాళ్లను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. శివరాత్రి రోజున పల్నాడు నుంచే కాక రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కొండకు తరలివస్తారు. స్వామిని దర్శించుకుని రాత్రంతా జాగరణ చేస్తారు.
Shivaratri Arrangements in Kotappakonda : తిరునాళ్ల ఏర్పాట్లో భాగంగా కోటప్పకొండపై చలువ పందిళ్లు, క్యూ లైన్లను సిద్ధం చేస్తున్నారు. ప్రధానాలయంతో పాటు కోటప్పకొండ క్షేత్రంలో ఉన్న వరసిద్ధి వినాయక దేవాలయం, కోటేశ్వరస్వామి ఆలయం, మెట్ల మార్గంలో ఉన్న ఆనందవల్లి అమ్మవారి గుడి, రుద్ర శిఖరంపై పాత కోటేశ్వరస్వామి క్షేత్రం, విష్ణుశిఖరంపై పాప విమోచనేశ్వర స్వామి దేవాలయం, ఎగువ సన్నిధిలో వినాయక విగ్రహం, మేధా దక్షిణమూర్తి ఆలయం, నాగేంద్రస్వామి పుట్ట, నవగ్రహ మండపాలను విద్యుత్ కాంతులతో అందంగా తీర్చిదిద్దారు. పిల్లలపార్కు, కాళింది మడుగు లాంటి దర్శనీయ స్థలాలకు రంగులు వేసి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తుల కోసం రెండున్నర లక్షల లడ్డూ ప్రసాదాలు, అరిసెలు అందుబాటులో ఉంచారు.
శివరాత్రి నాడు కోటప్పకొండకు సుమారు 30 నుంచి 40 వరకు భారీ విద్యుత్ ప్రభలు వస్తాయి. వీటి కోసం ముందుగానే కొండ కింద స్థలం కేటాయించారు. కొండ మీదకు భక్తుల వాహనాలకు అనుమతి నిరాకరించారు. కేవలం ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే భక్తులు పైకి వెళ్లి స్వామి దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. కాలినడకన వెళ్లే భక్తులకు మెట్ల మార్గాన్ని సిద్ధం చేశారు. గతంలో మాదిరిగా ట్రాఫిక్ సమస్య లేకుండా రహదారులను విస్తరించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
శివభక్తులకు శుభవార్త -శైవ క్షేత్రాలకు 3,500 ప్రత్యేక బస్సులు
'ప్రసాద్' పథకానికి ఎంపికైన అరసవల్లి ఆలయం - ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక శోభ దిశగా చర్యలు