Agrigold Customers and Agents Welfare Association Protest: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆందోళన చేపట్టింది. గాంధీ బొమ్మ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా నిర్వహించింది. నెల్లూరు జిల్లాలో కోట్లాది రూపాయల విలువైన అగ్రిగోల్డ్ సంపదను అక్రమార్కులు కొల్లగొడుతున్నారని, ఈ అక్రమాలపై ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారని అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరావు ఆరోపించారు.
ఉదయగిరి, వరికుంటపాడు, కనిగిరి, దుత్తలూరు ప్రాంతాల్లోని అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న జామాయిల్ చెట్లను నరికి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. విలువైన సంపద దోచుకుంటున్నా అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని సక్రమంగా స్పందించకపోవడం దారుణమని అన్నారు. కూటమి ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని, అగ్రిగోల్డ్ సంపద కొల్లగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
నెల్లూరు జిల్లాలో కోట్లాది రూపాయల విలువైన అగ్రిగోల్డ్ సంపదను అక్రమార్కులు కొల్లగొడుతునన్నారు. ఈ అన్యాయంపై ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. మాకు కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఉంది. దీనిపై ప్రభుత్వం స్పందించి అగ్రిగోల్డ్ సంపదను దోచుకునే వారిపై కఠిన చర్యలు తీసుకొని, బాధితులకు న్యాయం చేయాలి.- ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్
చెట్లను నరికేస్తూ స్థానిక నాయకులు వ్యాపారం: నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు, వింజమూరు, దుత్తలూరు, కలిగిరి, కొండాపురం మండలాల్లో సుమారు 1600 ఎకరాలకుపైగా అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి. ఇందులో జామాయిల్ చెట్లు పెంచుతున్నారు. వీటిని కొట్టి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. భాస్కరాపురం, జంగారెడ్డిపల్లి, కనియంపాడు, రాచావారిపల్లి, తెల్లపాడు గ్రామాల్లోని భూముల్లో పదేళ్లు నుంచి ఉన్న జామాయిల్ వృక్షాలు ఏపుగా పెరిగాయి. కానీ ఈ చెట్లను నరికేస్తూ స్థానిక నాయకులు వ్యాపారం చేస్తున్నారు.
జామాయిల్ కర్రకు ప్రస్తుతం మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. టన్ను ధర రూ.7000 నుంచి రూ.8 వేల వరకూ పలుకుతోంది. కర్రను అక్రమంగా తరలిస్తున్నారని ఫిర్యాదు చేసినా అధికారులు కనీసం స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు. నియోజకవర్గంలో కొందరు నాయకులు అండదండలతోనే ఈ దోపిడీ జరుగుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సీఐడీ అధికారులూ దోపిడీని పట్టించుకోవడం లేదన్న స్థానికులు ఇప్పటికే 5వేల టన్నుల కర్రను తరలించినట్లు చెబుతున్నారు.
పద్ధతి లేని సాగు లెక్కలు - కాలం చెల్లిన కొనుగోలు విధానాలే రైతన్నకు శాపం!
జాగ్రత్త - ఆ బురద మనకు అంటించాలని చూస్తారు - జనసేన సభ్యులతో పవన్ కల్యాణ్