BJP MP Purandeswari About Budget : ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న పేరాబత్తుల రాజశేఖరాన్ని భారీ మెజార్టీతో గెలిపించడమే బీజేపీ లక్ష్యమని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. జేఎన్ రోడ్డు సమీపంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జిల్లా బీజేపీ అధ్యక్షుడు పి. నాగేంద్ర అధ్యక్షతన బడ్జెట్‌పై సమావేశం అనంతరం ఎన్నికలపై ఎంపీ మాట్లాడారు. ఉపాధ్యాయ, నిరుద్యోగ సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి చట్టసభకు వెళ్తే పరిష్కారాలను సాధిస్తారని ఓటర్లకు వివరించాలన్నారు. పి. నాగేంద్ర మాట్లాడుతూ ఎంపీ చొరవ వల్ల దివాన్‌చెరువు నుంచి గామన్ వంతెనకు అనుసంధానంగా రూ.326 కోట్లతో పై వంతెన నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపిందన్నారు.
సమాజంలో అట్టడుగు వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ప్రజలందరికీ మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ రూపొందించారని దీనిపై నిర్మాణాత్మక సూచనలొచ్చాయే తప్ప విమర్శలు లేకపోవడమే అందుకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. మహిళలు, రైతులు, యువత, పెట్టుబడులను ప్రోత్సహిస్తూ ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్న వికసిత్‌భారత్ లక్ష్యంగా నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. స్వయం సహాయక సంఘాల రుణపరిమితిని రూ.20 లక్షలు పెంచడం ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవకాశం కల్పించారన్నారు.
ఈ నెల27న పట్టభద్రుల ఎన్నిక పోలింగ్ - ఎమ్మెల్సీ ఓటు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
రైతులకు ఏటా పెట్టుబడి రూ.10 వేలకు పెంచారని, ఎకరాకు అయ్యే పెట్టుబడి మొత్తానికి 50 శాతం జోడించి కనీస మద్దతు ధర నిర్ణయించారన్నారు. ‘డ్రోన్ దీదీ’లను ప్రోత్సహించేందుకు రూ.10 లక్షల డ్రోన్‌ను రాయితీపై రూ.2 లక్షలకే ఇచ్చేందుకు నిర్ణయించారన్నారు. దేశ జనాభాలో 25 శాతం మేర యువత ఉన్నారని వారికి నైపుణ్య శిక్షణ ఇస్తే ప్రపంచానికి సరిపడా మానవవనరులు అందించగల సత్తా ఏర్పడుతుందన్నారు. 50 వేల అటల్‌టింకరింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారని, ఐఐటీ, ఐఐఎం తదితర ఉన్న విద్యా సంస్థల పెంపు, ఏడాదికి 10 వేల మెడికల్ సీట్లు అదనంగా కల్పించేలా నిర్ణయాలు చేశారన్నారు. ముద్రయోజన రుణ పరిమితి రూ.20 లక్షలకు పెంచడం రోడ్డు, రైలు, విమానాశ్రయాల సంఖ్య పెంచుతుండటం శుభ పరిణామమన్నారు.
ప్రజలకు, పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండేలా మినీ న్యూక్లియర్ ప్లాంట్ల ఏర్పాటుకు సంకల్పించారన్నారు. మధ్య తరగతి వర్గాలకు మేలు చేసేలా రూ.12.75 లక్షల వరకు పన్ను రాయితీ ఇచ్చారన్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ విధ్వంస పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదని, ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఆ భారం కూటమి ప్రభుత్వంపై పడిందన్నారు. చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకుంటోందని వివరించారు.