Minister Uttam on Sitarama Project : గత ప్రభుత్వం ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేసినా నీళ్లు ఇవ్వలేకపోయారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేపడుతామని ఆయన స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టు-2, 3 లిఫ్ట్ ఇరిగేషన్లను పంద్రాగస్టున సీఎం ప్రారంభిస్తారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
ఆగస్టు15నే రూ.2 లక్షల రైతు రుణమాఫీ ప్రకటిస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఏటా 6 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని, 2026 ఆగస్టు 15 నాటికి ఆయుకట్టులోని ప్రతి ఎకరానికి నీరిస్తామని మంత్రి వెల్లడించారు. గతంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అనుమతులు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చామన్నారు. ఈనెల ఆఖరులోపు సీతారామ ప్రాజెక్టుకు గోదావరి జలాలు వచ్చేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు :గత ప్రభుత్వం రూ.3 లక్షలు కోట్లు అప్పులు చేసి ఉంటుందని అంచనా వేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. తమ అంచనాలకు మించి రూ.7 లక్షల కోట్లు అప్పులు చేశారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తోందన్నారు. రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలలోపు ఉన్న రుణాలను పంద్రాగస్టున మాఫీ చేస్తామని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలు మంచి సలహాలు ఇస్తే స్వీకరించడానికి తమకు ఎలాంటి బేషజాలు లేవని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. రెండు నెలల్లోపు ఎల్‌ఆర్‌ఎస్ సమస్యను పరిష్కరిస్తామని, త్వరలో కొత్తరేషన్‌కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేస్తామని వెల్లడించారు. తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన రూ.7.18 లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కడుతున్నామన్నారు.