Ministers Reaction on Telangana Budget : శాసనసభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్(Oton Account Budget)పై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌పై వీరు ప్రకటనలను విడుదల చేశారు.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ దూరదృష్టితో కూడుకున్నదని, రాష్ట్ర ఆర్థిక పునర్జీవనానికి పునాదులు వేసేలా ఉందని పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనియాడారు. గత పదేళ్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బీఆర్ఎస్ హయాంలో నాశనం చేశారని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తొలి బడ్జెట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ(Telangana Economy) పునరుజ్జీవనానికి పునాది వేసిందని ఆనందించారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించదన్నారు.
మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ నాణ్యత, అనాలోచిత డిజైన్లు అవినీతిపై సమగ్ర విచారణకు ఇప్పటికే ఆదేశించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బడ్జెట్లో నీటి పారుదల విభాగానికి రూ.28,024 కోట్లు కేటాయించడాన్ని మంత్రి స్వాగతించారు. ఆరు గ్యారంటీల కోసం రూ.2.75 లక్షల కోట్ల మధ్యంతర బడ్జెట్లో రూ.53,196 కోట్లు కేటాయించామన్నారు. ఇందులో రూ.500లకే ఎల్పీజీ సిలిండర్‌ను అందజేస్తామన్న హామీలలో ఒకదానిని పౌర సరఫరాల శాఖ తమ పరిధిలోనే అమలు చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి ప్రక్రియలో గణనీయంగా దోహదపడుతున్న బడ్జెట్ అభివృద్ధికి, సంక్షేమానికి మధ్య సమతూకం కలిగిందని హర్షం వ్యక్తం చేశారు.
మేడిపండు లాంటి బడ్జెట్, నేమ్ ఛేంజర్ మాత్రమే గేమ్ ఛేంజర్ కాదు : బీఆర్ఎస్ నేతల రియాక్షన్
తమది ప్రజా సంక్షేమ బడ్జెట్ :కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజా సంక్షేమ బడ్జెట్‌గా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం ఆరు గ్యారంటీ(Congress Six Guarantees)ల అమలుకు కట్టుబడి ఉందని మంత్రి ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆరు గ్యారంటీలకు అనుగుణంగా ఒట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని వివరించారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్ల చొప్పున అదనపు నిధులు, మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్య శ్రీ, గృహజ్యోతి, రూ.500 గ్యాస్ ఈ మొత్తానికి కలిపి రూ.53,196 కోట్లు కేటాయించారని తెలిపారు. బీసీ సంక్షేమం కోసం బడ్జెట్లో రూ.8000 కోట్లు, బీసీ గురుకుల భవనాల కోసం రూ.1546 కోట్లు కేటాయించినట్లు బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Minister Jupally Krishna Rao on Budget : అసెంబ్లీలో సీఎం నేతృత్వంలోని ప్రభుత్వం వాస్తవిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్రాన్ని పునర్నించుకోవడంపై దృష్టి పెట్టామని, అందుకే డాంభికాలకు పోకుండా వాస్తవిక దృక్పథంతో బడ్జెట్‌ను రూపొందించామని మంత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రూపుదిద్దుకుందని తెలిపారు.
అందుకే విద్య, వైద్యం, వ్యవసాయ, సాగునీటి రంగాల అభ్యున్నతి, సంక్షేమాభివృద్దిని సాకారం చెసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు ముందుకు వేస్తోందని వివరించారు. ఆరు గ్యారంటీ పథకాల అమలు ద్వారా ప్రజలకు మరింత మెరుగైన జీవితాన్ని అందించాలనే తపన ఈ బడ్జెట్లో కళ్లకు కడుతోందని అభివర్ణించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ లోపభూయిష్టంగా ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రాష్ట్ర పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో నెట్టినట్లుందని విమర్శించారు.
అందరి కోసం మనమందరం అనే స్ఫూర్తితో 'ఓటాన్ అకౌంట్ బడ్జెట్'
రూ.2.75 లక్షల కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ - ఏ శాఖకు ఎంతంటే?