Minister Uttam Kumar Reddy on Krishna Projects and KRMB Issues :ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. షరతులు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని తెలిపారు. కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ మంత్రి తీర్మానం ప్రవేశపెట్టి, ఆ విషయాలను పవర్ పాయింట్ ద్వారా ఎమ్మెల్యేలకు వివరించారు. రాష్ట్ర ప్రజలకు అపోహ కలిగించేలా కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శాసనసభలో ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ద్వారా మంత్రి వివరిస్తున్నారు. ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం సాగర్‌పై పోలీసులను పంపించిన విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నదీ జలాల విషయంలో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని అందరం ఆశించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రోజుకు 3 టీఎంసీలు ఏపీ అక్రమంగా తరలించుకు వెళుతుందని అన్నారు. పదేళ్ల పాటు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 219 టీఎంసీలకు బీఆర్ఎస్ సర్కారు ఒప్పుకుందన్నారు. ప్రతి ఏడాది దిల్లీకి వెళ్లి 512:219 టీఎంసీలకు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ నీటి హక్కుల సాధనలో బీఆర్ఎస్ సర్కారు విఫలమైందని విమర్శించారు. బచావత్ ట్రిబ్యునల్(Bachawat Tribunal) ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదని శాసనసభలో మంత్రి తెలిపారు.
నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రుల సమీక్ష - ప్రాజెక్టుల అంచనాలు పెంచి ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆగ్రహం
Uttam Kumar Reddy speech on Irrigation Projects : బీఆర్ఎస్ పాలకులది అసమర్థతనో, అవగాహన లోపమో అర్థం కావడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణా జలాల్లో(Krishna Projects) 70 శాతం హక్కు పొందేందుకు తెలంగాణకు పూర్తి అర్హత ఉందని చెప్పారు. కానీ 512:219 టీఎంసీల కేటాయింపును ఏపీ శాశ్వతం చేస్తోందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి స్వతంత్ర భారతంలో ఎప్పుడూ జరగలేదని విమర్శలు చేశారు. కేసీఆర్ చాలా గొప్పవారని ఏపీ అసెంబ్లీలో జగన్ పొగిడారని, తెలంగాణ జలాలను సైతం ఏపీకి ఇస్తున్నారని జగన్ చెప్పారని నీటిపారుదల శాఖ మంత్రి తెలిపారు.
"జగన్, కేసీఆర్ గంటల తరబడి మాట్లాడుకున్నారు. కేసీఆర్, జగన్ కలిసి బిర్యానీలు తిన్నారు. కేసీఆర్ చాలా గొప్పవారని ఏపీ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం జగన్ పొగిడారు. తెలంగాణ జలాలను సైతం ఏపీకి ఇస్తున్నారని జగన్ చెప్పారు. 2020 మే 5న ఏపీ ప్రభుత్వం జీవో 203 ద్వారా రోజుకు 3 టీఎంసీలు తరలించాలని నిర్ణయించింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా రోజుకు 3 టీఎంసీలు తరలించాలని నిర్ణయించింది. 797 అడుగుల వద్ద నీటి తరలింపునకు జీవో ఇచ్చింది."- ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి
అసెంబ్లీ సమావేశాలు పొడిగించే అవకాశం - 16 వరకు ఉభయసభల భేటీ!
నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదలకు ప్రభుత్వం సన్నద్ధం - ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం