Minister Seethakka Fire on Abuse of Social Media : సోషల్ మీడియాలో ఓ చిన్నారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటనపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని, నిందితులకు కఠిన శిక్షణ పడేలా చేస్తామని మంత్రి తెలిపారు. పోలీసులు ఇప్పటికే కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు.
సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తాం : తండ్రీ కుమార్తె మధ్య అనుబంధం, అనురాగాల్ని కొన్ని మృగాలు అసభ్యంగా వక్రీకరించడం దారుణమని సీతక్క వ్యాఖ్యానించారు. కొందరు వారి అసభ్యకరమైన ఆలోచనను తండ్రీ కుమార్తెకు అంటగట్టడం దుర్మార్గమైన చర్యగా మంత్రి అభివర్ణించారు. చిన్నారుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని, చవక హాస్యం కోసం కుటుంబ సంబంధాలను అపహస్యం చేస్తూ సోషల్ మీడియాను దుర్వినియోగ పరుస్తున్న అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట పడేలా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
"తండ్రీ కుమార్తెల మధ్య ఉన్న అనుబంధాన్ని కొంతమంది నీచ వ్యక్తులు ఈ సమాజంలో మృగాళ్ల తిరుగుతూ ప్రతిదాని వెనుక ఒక అసభ్యకరమైన ఆలోచనను అంటగడుతున్నారు. ఈ మేరకు వాళ్లకు ఉండేటటువంటి నికృష్ట ఆలోచనకు సోషల్ మీడియా వేదిక అవ్వటం జరుగుతుంది. ఈ ఘటనపట్ల తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే కేసు నమోదు చేశాం. అదేవిధంగా భవిష్యత్లో కూడా ఇటువంటి దుర్మార్గులు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కఠినచర్యలు తీసుకుంటాం."-సీతక్క, రాష్ట్ర మంత్రి