Heavy Rain Forecast for Hyderabad City Today : రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదారాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 18, 19, 20తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. నేడు ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగాం జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. సోమవారం దక్షిణ ఒడిశా తీరం వద్ద వాయువ్య దాని పరిసర పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈరోజు దక్షిణ ఛత్తీస్ఘర్ పరిసర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైనదని తెలిపింది. దీని అనుబంధ ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి. మీ. ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉందని చెప్పింది.
ఋతుపవన ద్రోణి నేడు జైసాల్మయిర్, కోట ఛత్తీస్ఘర్ పరిసర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రాంతం గుండా వెళుతూ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతుందని చెప్పింది. గాలి విచ్చిన్నతి ఈరోజు 19 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సగటు సముద్ర మట్టానికి 3.1 కి. మీ. నుండి 7.6 కి.మీ ఎత్తు మధ్యలో కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉందని పేర్కొంది. మరి ఒక అల్పపీడన ప్రాంతం జులై 19 తేదీన పశ్చిమ-మధ్య దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.