Minister Nara Lokesh Recalled Memories of Yuva Galam Padayatra :రాష్ట్ర రాజకీయాల్లో సంచలన ఘట్టాలను నమోదు చేసిన చారిత్రాత్మక యువగళం నాటి అనుభవాలను యువనేత నారా లోకేశ్ ఏ మాత్రం మర్చిపోలేదు. మంత్రిగా చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన లోకేశ్ ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. బంగారు పాళ్యంలో పర్యటన ముగించుకొని తిరిగి రేణిగుంట ఎయిర్ పోర్టుకు రోడ్డు మార్గాన వెళ్లే సమయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గతంలో యువగళం పాదయాత్ర సాగే సమయంలో గాదంకి టోల్ గేట్ వద్దకు చేరుకున్నప్పుడు లోకేశ్ అక్కడే ఆగి టీ తాగారు.
ఈరోజు (శుక్రవారం) రేణిగుంట ఎయిర్ పోర్టుకు రోడ్డు మార్గాన వెళ్తున్నప్పుడు పక్కనే ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మంత్రి లోకేశ్‌కు గాదంకి టోల్ గేట్ వద్ద టీ తాగిన విషయాన్ని గుర్తుచేశారు. వెంటనే కాన్వాయ్‌ని ఆపిన మంత్రి లోకేశ్ టీ స్టాల్ లోకి వెళ్లారు. అక్కడి కార్యకర్తలతో కలిసి చాయ్ తాగి యువగళం నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కుశల ప్రశ్నలు వేశారు. దాదాపు అర్థగంట పాటు అక్కడే కార్యకర్తల కోసం సమయం కేటాయించడంతో వారంతో ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం టీ స్టాల్ యజమాని రమేష్ విజయవాడ వరద బాధితులకోసం రూ. 25 వేల ఆర్థిక సహాయన్ని లోకేశ్‌కు అందజేశారు. దీంతో లోకేష్ రమేష్‌ను అభినందించారు.