SIT Investigation Tirumala Laddu Row : తిరుమల శ్రీవారి లడ్డూ కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే శ్రీవారి ఆలయం పోటులో విచారణ చేపట్టింది. లడ్డూ తయారీకి సంబంధించిన కీలక వివరాలను సేకరించింది. ఇందుకోసం వినియోగించే నెయ్యి నాణ్యత గురించి విచారణ బృందం అడిగి తెలుసుకుంది. రోజూ ఎంత నెయ్యి వినియోగిస్తారు? ఎక్కడ నుంచి తీసుకొస్తారంటూ? ఆరా తీసింది. ఈ నేపథ్యంలోనే పిండి మరను పరిశీలించింది. అదేవిధంగా ఆహార ఉత్పత్తుల నిల్వ ప్రదేశం, పరిశోధనశాలను సిట్ బృందం తనిఖీ చేసింది
మరోవైపు ఇప్పటికే ఏఆర్ డెయిరీతో పాటు వైష్ణవి డెయిరీలను సిట్ అధికారులు పరిశీలించారు. ఆ సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. టీటీడీకి నెయ్యి ఒప్పందాన్ని దక్కించుకున్న సంస్థనే నేరుగా సరఫరా చేసిందా? లేక ఇతర కంపెనీల నుంచి తెచ్చి ఇచ్చిందా? అనేది పరిశీలన చేస్తోంది. టెండర్ సమయంలో టీటీడీ పేర్కొన్న నిబంధనలు ఏమిటి? ఆయా సంస్థల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే విషయాలను సరిపోల్చుతున్నారు.
నెయ్యి సరఫరాకు ఆయా సంస్థలకు ఏ మేరకు ఉత్పత్తి సామర్థ్యం ఉండాలని టీటీడీ నిర్ణయించింది, ఇప్పుడు ఎంత ఉందని తమ పరిశీలనలో తేలిందో అధికారులు సరి చూశారు. అధికారులు ఇప్పటికే ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి సేకరించి టీటీడీకి సరఫరా చేస్తుందన్న విషయమై కూడా కొంత సమాచారాన్ని సేకరించారు. మరోవైపు తాము సరఫరా చేస్తున్న నెయ్యి నాణ్యతతో ఉన్నట్లు ఎస్‌ఎంఎస్ ల్యాబ్ ధ్రువీకరించిందని ఏఆర్ డెయిరీ పేర్కొంటోంది. ఈ క్రమంలో ఆ పరీక్షలు నిర్వహించిన తేదీలను అధికారులు పరిశీలన చేస్తున్నారు.
వైష్ణవి నుంచి కూడా కాదా? : తమిళనాడులోని దిండుక్కల్‌లోని ఏఆర్ డెయిరీ, శ్రీకాళహస్తి ప్రాంతంలోని వైష్ణవి డెయిరీలతో పాటు చెన్నైలోని ఎస్‌ఎంఎస్ ల్యాబ్ నుంచి స్వాధీనం చేసుకున్న కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సిట్‌లోని 2 బృందాలు తిరుపతిలోని కార్యాలయంలో వీటిని నిశితంగా పరిశీలించాయి. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం వైష్ణవి డెయిరీకి లేదని, ఈ డెయిరీ నిర్వాహకులు 2 ఇతర డెయిరీల నుంచి నెయ్యి సేకరించి టీటీడీకి సరఫరా చేసినట్లు అదీ నాణ్యతా లోపంగా ఉందని సిట్ నిర్ధారించినట్లు తెలిసింది.
SIT Inquiry Adulterated Ghee Case : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో అవకతవకలు జరిగాయని కూటమి ప్రభుత్వం నిర్ధారించింది. లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతు అవశేషాలు ఉన్నట్లు గుర్తించి విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంపై జోక్యం చేసకున్న సుప్రీంకోర్టు ప్రత్యేక బృందాన్ని నియమించి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరింది.
ఏఆర్ డెయిరీలో సిట్ తనిఖీలు- తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో క్షేత్రస్థాయిలో దర్యాప్తు
తిరుమలలో సిట్ బృందం - కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ ప్రారంభం