Ways To Use Tamarind for Skin : చింతపండుతో రసం, చారు, పులిహోర చేస్తుంటాం. ఇలా కూరలకు పుల్లటి రుచిని అందించే చింతపండు సౌందర్య పోషణలోనూ ఉపయోగించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చింతపండుతో కొన్ని ఫేస్‌ప్యాక్స్ ట్రై చేయడం వల్ల మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యల్ని తగ్గించుకోవచ్చని అంటున్నారు. ఆ ఫేస్‌ప్యాక్స్ ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
![Tamarind](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-02-2025/23534151_tamarind.jpg)
స్కిన్ గ్లో :
టేబుల్‌స్పూన్ చిక్కటి చింతపండు గుజ్జును తీసుకొని దానికి అరచెంచా పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకొని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ స్కిన్ గ్లోని పెంచుతుంది.
బ్లీచ్‌గానూ :
చింతపండు గుజ్జుకు కొద్దిగా అరటిపండు గుజ్జు, శనగపిండిని జత చేసి పేస్ట్‌లా రెడీ చేసుకోవాలి. దీనిని చర్మానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని వాటర్‌తో కడిగేసుకోవాలి. ఈ మిశ్రమం బ్లీచింగ్ ఏజెంట్‌లా పనిచేసి చర్మాన్ని క్లీన్ చేస్తుంది.
![Tamarind Paste](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-02-2025/23534151_beauty.jpg)
స్క్రబ్‌గా :
చింతపండు గుజ్జును కొద్దిమొత్తంలో తీసుకొని దానికి టేబుల్‌స్పూన్ నిమ్మరసం, చెంచా పంచదార, అరచెంచా బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమంతో శరీరాన్ని మృదువుగా మర్దన చేసుకొని 15 నిమిషాల తర్వాత వేడినీటితో స్నానం చేయాలి. ఈ మిశ్రమం జిడ్డు చర్మం కలిగిన వారికి, మొటిమల సమస్యతో బాధపడే వారికి బాగా ఉపయోగపడుతుంది.
మొటిమలకు చెక్!
ముందుగా నిమ్మకాయంత సైజంత చింతపండును తీసుకొని దాన్ని పావుకప్పు వేడినీటిలో వేసి కాసేపు నాననివ్వాలి. తర్వాత పిప్పిని వేరుచేయాలి. ఇందులోంచి టేబుల్ స్పూన్ చిక్కటి గుజ్జును తీసుకోవాలి. దీనికి ఒక టేబుల్‌స్పూన్ ముల్తానీ మట్టి, కొద్దిగా రోజ్‌వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి, మెడకు మాస్క్‌లా అప్లై చేసుకోవాలి. ఓ 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒకేసారి ఎక్కువ మొత్తంలో చేసుకొని ఫ్రిడ్జ్‌లోనూ స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఫేస్‌ప్యాక్ తరచూ వేసుకోవడం వల్ల మొటిమల సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చర్మం కొత్త మెరుపును సంతరించుకుంటుందని అంటున్నారు.
టోనర్‌గా :
రెండు టేబుల్స్పూన్ల చింతపండు రసాన్ని తీసుకొని, దీనికి రెండు చెంచాల టీ డికాషన్‌ను కలపాలి. ముఖం కడుక్కున్న తర్వాత ఈ మిశ్రమంలో దూదిని ముంచి ముఖానికి అప్లై చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో మరోసారి ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.
గమనిక : ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాల్సిన ఉంది. అది ఏంటంటే చింతపండును చర్మానికి నేరుగా రాసుకోకూడదు. దీనిని ఇతర పదార్థాలతో కలిపి మాత్రమే ఉపయోగించాలి. అంతేకాదు చింతపండును వాడడం వల్ల కొంతమందిలో అలర్జీ వంటి దుష్ప్రభావాలు కూడా రావచ్చు. కాబట్టి ఈ బ్యూటీ టిప్స్ విషయంలో వ్యక్తిగత సౌందర్య నిపుణులను సంప్రదించి వారి సలహా మేరకు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతే ఉపయోగించడం మంచిది.
ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి బంగారం తీస్తున్నారు! - కొత్త పద్ధతిని కనిపెట్టిన శాస్త్రవేత్తలు
ఇండియన్ ఆర్మీలోకి రోబోలు - ఇవి బాంబులకు బెదరవు, బుల్లెట్లకు భయపడవు!