Is it Good to Give Fruit Juices to Children : పిల్లలు అన్నం తినకుండా ఎంతో మారం చేస్తుంటారు. అటూ ఇటూ తిరుగుతూ, ముఖం తిప్పుకుంటూ అన్నం వద్దు అంటుంటారు! బ్రతిమిలాడో, భయపెట్టో ఏదోకటి చేసి వారికి రోజూ అన్నం తినిపించడానికి తల్లులు ఎంతో కష్టపడతారు. మరికొంతమంది పిల్లలు పండ్లు తినడానికి కూడా ఆసక్తి చూపించరు. పండ్లు కాకుండా వాటితో జ్యూసులు చేసి ఇస్తే ఇష్టంగా తాగుతారు. పిల్లలు జ్యూస్‌లు తాగుతున్నారు కదా! అని కొందరు మమ్మీలు డైలీ జ్యూస్‌లు ఇస్తుంటారు. అయితే, ఇలా పిల్లలకు ప్రతిరోజు జ్యూస్‌లు ఇవ్వడం వల్ల ఏమైనా సమస్యలొస్తాయా? ఈ అలవాటు మంచిదా, కాదా? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పిల్లలకి జ్యూస్ కన్నా, పండ్లు ఇస్తేనే మేలని ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ లతాశశి సూచిస్తున్నారు. వారికి జ్యూసులు ఇవ్వడం వల్ల ఏమవుతుందో ఆమె మాటల్లోనే చూద్దాం.
పిల్లలు ఎదిగే క్రమంలో రకరకాల పండ్లను తినిపించడం వల్ల రుచులన్నీ పరిచయం అవుతుంటాయి. పండుని మొత్తం ఇవ్వకుండా చిన్నచిన్న ముక్కలుగా కోసి తినిపించాలి. జ్యూస్‌లు తీయగా ఉండడంతో పిల్లలు వాటినే తాగడానికి ఇష్టపడతారు. వాళ్లు మారం చేస్తున్నారని, తిండికి దూరమవుతున్నారని జ్యూస్‌లు అలవాటుచేస్తే క్రమేణా నీళ్లు తాగడానికి ఇష్టపడరు. అందుకే పిల్లలకు జ్యూస్‌లు చేసి ఇవ్వకుండా పండ్ల ముక్కలు తినిపించడం అలవాటు చేయాలి.
"సాధారణంగా మనం జ్యూస్ చేసేటప్పుడు ఒకటికి మించి పండ్లను వాడతాం. దాంతో పిల్లల ఆహారంలో ఫ్రక్టోజ్ అధికమయ్యే ప్రమాదముంది. అంతేకాదు, ఆహారం తినడం లేదనీ, జ్యూస్ తాగినా చాలనీ అనుకుంటారు కొందరు తల్లులు. నైట్ టైమ్ నిద్రపోయేముందూ వీటిని ఇస్తుంటారు. వీటన్నింటి వల్లా దంతసమస్యలు మొదలయ్యే అవకాశం ఉంది." -డాక్టర్ లతాశశి, పోషకాహార నిపుణురాలు
ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం రెండు నుంచి ఐదు ఏళ్ల వయసున్న పిల్లలకి 125 మి.లీ. కన్నా ఎక్కువ జ్యూస్ ఇవ్వకూడదు. అది కూడా, తాజాగా తయారు చేసినదై ఉండాలి. నిల్వ, ప్రాసెస్ చేసిన ఫ్రూట్ జ్యూస్వల్ల జీర్ణవ్యవస్థపై చెడుప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఇలాంటి జ్యూసుల్లో ఫైబర్ ఉండదు. దాంతో మలబద్ధక సమస్యలు అధికమవుతాయి. పైగా, పండ్లలో కంటే రసాల్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తాగడం వల్ల పిల్లలు బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వారికి చిన్ననాటి నుంచే పండ్లు తినడాన్నే అలవాటు చేయాలని డాక్టర్ లతాశశి తెలిపారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అలర్ట్ : ఈ 10 వస్తువులు తాకితే వెంటనే చేతులు కడగాలట! అవేంటో మీకు తెలుసా?
టీవీ చూస్తూ అన్నం తింటున్నారా? డిన్నర్లో ఈ తప్పులు చేస్తే ఇబ్బందులు తప్పవట!