Left Handed People Facts : ప్రపంచంలో ప్రతి 10 మందిలో ఒకరు ఎడమ చేతి వాటం ఉన్నవారని ఒక అంచనా. అయితే, మన చుట్టూ దాదాపు అందరూ ఎడమ చేతి వాటం ఉన్నవారు ఉండడం మనం గమనించవచ్చు. ఇలా లెఫ్ట్ హ్యాండ్ ఉన్నవారు ఇతరులతో సంభాషించడం లేదా నలుగురితో కలవడంలో ముందుంటారని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎడమ చేతి వాటం ఉన్నవారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
చేతివాటం, మెదడులోని భాషాప్రాంతాలు వంటివాటిపై ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం పరిశోధన చేపట్టింది. న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం మేరకు, ఎడమచేతి వాటం ఉన్నవారిలో మెదడు ఎడమ, కుడివైపులా ఉన్న భాషాప్రాంతాలు ఒకదానితో ఒకటి మరింత సమన్వయంతో సంభాషించుకుంటాయట. దీనివల్ల ఇటువంటివాళ్లకు మౌఖిక పనులు చేసేటప్పుడు మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉందని కనుగొన్నారు.
కొందరికి ఎడమచేతి వాటం ఉంటుందెందుకు?
ఎడమ చేతి వాటం ఉండడానికి గల కారణాలను హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ ఈవీ సుబ్బారావు తెలియజేస్తున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే- 'కొంతమంది ఎడమ చేతితో రాస్తారు. బ్యాట్మింటన్‌లాంటి ఆటల్ని ఎడమచేత్తో ఆడతారు. ఇలా అందరిలాగా కుడిచేత్తో కాకుండా ఎడమ చేతి వాటం ప్రదర్శించడానికి జన్యువులు, పరిసరాల ప్రభావం వంటివి కారణాలు. సహజంగా స్త్రీలకన్నా, పురుషుల్లో ఎడమచేతి వాటం వారు 50శాతం ఎక్కువ. మామూలుగా జన్మించిన శిశువులకన్నా కవల పిల్లల్లో ఈ లక్షణం 17శాతం అధికం. ఎడమచేతి వాటం సంక్రమించడంలో మెదడు ముఖ్య పాత్ర వహిస్తుంది'
మనలో ఎక్కువమందికి కుడిచేతి వాటం ఉన్నట్లే మనం మాట్లాడే మాటల్ని కూడా మెదడులోని కుడి అర్ధభాగం నియంత్రిస్తుంది. అదే లెఫ్ట్ హ్యాండ్ వారిలో ఈ విషయంలో వ్యతిరేకంగా ఉంటుంది. ఇక జన్యువుల విషయానికి వస్తే ఈ ఎడమ చేతివాటం వారి విషయంలో కాస్త క్లిష్టతరంగా ఉంటుంది. పేరెంట్స్ ఇద్దరూ ఎడమచేతివాటం వారైనా, వారి సంతానం కూడా ఎడమచేతివాటం కలిగి ఉండే ఛాన్స్ 26శాతం ఉంటుంది. ఎడమచేతి వాటం కలిగి ఉండటానికి కారణం అయిన LRRTM1 జన్యువు తండ్రి నుంచి శిశువుకి సంక్రమిస్తే ఈ లక్షణం వస్తుంది. ఈ లక్షణం శిశువు గర్భంలో ఉన్నప్పుడు తల్లి శరీరంలో ఉండే టెస్టోస్టీరాన్ అనే హార్మోన్ స్థాయిపై కూడా ఆధారపడి ఉంటుందని ప్రొఫెసర్ ఈవీ సుబ్బారావు తెలిపారు.
![Sachin Tendulkar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-02-2025/23535885_left2.jpg)
ఎందరో ప్రముఖులు!
ప్రపంచ వ్యాప్తంగా ఎడమచేతి వాటం ఉన్నవారిలో రాజకీయ, సామాజిక, క్రీడా రంగాల్లో ఎందరో ప్రముఖులు ఉన్నారు. మహాత్మాగాంధీ, చార్లెస్ డార్విన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, న్యూటన్, బిల్‌క్లింటన్, బెంజమిన్ ప్రాంక్లిన్, జార్జి బుష్, ఒబామా, జస్టిన్ బీబర్, సింగర్ లేడీ గాగా, రతన్‌టాటా, సచిన్ టెండూల్కర్, సౌరవ్‌గంగూలీ, రవిశాస్త్రి, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, కుంబ్లే, శిఖర్ ధావన్, జహీర్ ఖాన్, అమితాబచ్చన్, అభిషేక్ బచ్చన్, మహానటి, సూర్యకాంతం, సావిత్రి, మమ్ముట్టి, ఇలా ఎడమ చేతివాటం వ్యక్తుల జాబితాలో చాలా మంది ప్రముఖులే ఉన్నారు.
ఎడమ చేతివాటం వారిపై నిర్వహించిన పలు అధ్యయనాల్లో తేలిన ఆసక్తికరమైన విషయాలు!
- సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి ఎక్కువ, జ్ఞాపక శక్తి అధికం
- ఒకేసారి ఎక్కువ పనులు చేయగల సామర్థ్యం కలిగి ఉంటారు.
- సంగీతకారులు, చిత్రకారులు, ఆర్కిటెక్ట్‌ల్లో ఎక్కువగా ఎడమ చేతివాటం వారే ఉంటారు.
- బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా కుడిచేతి వాటం వారి కంటే వేగంగా కోలుకుంటారు.
- బాక్సింగ్, బేస్‌బాల్, ఫెన్సింగ్, టెన్నిస్ వంటి క్రీడల్లో కుడి చేతివాటం వారితో పోలిస్తే ఎడమ చేతివాటం వారికి కొద్దిగా ప్రయోజనం ఎక్కువ.
- టైపింగ్‌లోనూ వీరికి ఎక్కువ లభాలు ఉంటాయి. క్వర్టీ కీబోర్డులో ఒక్క ఎడమ చేతితో వీరు మూడు వేల పదాలను టైప్ చేయగలరు. అదే కేవలం కుడి చేయి మాత్రమే వినియోగించి మూడు వందల పదాలు మాత్రమే టైప్ చేయగలం.
- కొందరు ఎడమ చేతివాటం వారన్నా ఎడమ దిశ అన్నా భయపడుతుంటారు. దీనిని 'సినిస్ట్రోఫోబియా'గా పిలుస్తారు.
- ప్రపంచ జనాభాలో 10 నుంచి 12 శాతం మంది ఎడమ చేతివాటం వారే.
- బ్రెయిన్లోని ఎడమ, కుడి భాగాల్లో మెరుగైన అనుసంధానం ఉంటుంది.
- కుడి చేతి వాటం ఉన్నవారి కన్నా ఎడం చేతి అలవాటున్న వారికి షిజోఫెర్నియా అనే వ్యాధి వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని, పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే అవకాశాలు మాత్రం తక్కువగా ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు.
- ఇక కుడి చేతివాటం వారితో పోలిస్తే ఎడమ చేతివాటం వారికి నీటి లోపల చూసే సామర్థ్యం అధికంగా ఉంటుందట.
న్యూస్పేపర్లో వాటిని ఎప్పుడైనా గమనించారా? - ఆ నాలుగు చుక్కలు ఏం సూచిస్తాయంటే!
ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి బంగారం తీస్తున్నారు! - కొత్త పద్ధతిని కనిపెట్టిన శాస్త్రవేత్తలు