TIRUMALA LADDU ROW: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ రెండో రోజు విచారణ ముగిసింది. అక్రమంగా నెయ్యి సరఫరాకు యత్నించిన భోలేబాబా సంస్థపై విచారణ జరిగింది. ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా డెయిరీ చుట్టూ సాగిన రెండో రోజు విచారణలో, వైష్ణవి, ఏఆర్ డెయిరీలతో ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీశారు.
అర్హత లేకున్నా ఏఆర్ డెయిరీ టెండర్లలో పాల్గొన్న తీరుపై వివరాలు సేకరించారు. ఏఆర్ డెయిరీకి టెండర్ ఈఎండీ మొత్తం భోలేబాబా డెయిరీ సమకూర్చడంపై ప్రశ్నలు సంధించారు. ఈఎండీ మొత్తాన్ని బదిలీ చేసిన ఖాతాల వివరాలు, బ్యాంకు లావాదేవీలపైనా ఆరా తీశారు. ఏఆర్ డెయిరీ ద్వారా కల్తీ నెయ్యి సరఫరా కుట్రపై సిట్ విచారించింది. కల్తీ నెయ్యి సరఫరాలో భోలేబాబా డెయిరీ కీలకంగా ఉన్నట్లు భావిస్తున్న సిట్, టెక్నికల్ బిడ్ సమయంలో టీటీడీ కొనుగోలు విభాగం వ్యవహరించిన తీరుపై ఆరా తీశారు. నెయ్యి కొనుగోలులో వైఫల్యాలపై టీటీడీ అధికారులను సైతం సిట్ విచారించనుంది.
తొలిరోజు విచారణ ఇలా జరిగింది: కల్తీ నెయ్యి ఘటనలో తొలిరోజు నిందితులను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. తిరుపతి సబ్‌జైలు నుంచి భోలేబాబా డెయిరీ మాజీ డైరెక్టర్లు విపిన్‌జైన్, పొమిల్జైన్లతో పాటు శ్రీవైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయకాంత్ చావడా, ఏఆర్ డెయిరీ ఎండీ డా.రాజు రాజశేఖరన్‌లను కస్టడీలోకి తీసుకుని విచారించారు. అలిపిరిలోని టీటీడీ భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయంలో ఈ విచారణ అంతా జరిగింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు విచారణ సాగింది. నిందితులను వేర్వేరు గదుల్లో ఉంచి విచారించారు.
తొలిరోజు నిందితులపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. భోలేబాబా డెయిరీ డైరెక్టర్లుగా వాహన డ్రైవర్లను డైరెక్టర్లుగా ఎందుకు నియమించాల్సి వచ్చింది? డెయిరీకి పాలు ఎక్కడ నుంచి సేకరిస్తారు? సేకరించిన పాల నుంచి వెన్న, నెయ్యి తయారీలో అనుసరించే విధానాలు ఏంటి? టీటీడీకి నెయ్యి సరఫరా చేసే టెండర్ దక్కడంలో సహకరించిన వ్యక్తులు ఎవరు? తదితర ప్రశ్నలను అడిగారు.
నెయ్యి కల్తీ కథేంటీ - నిందితులపై ప్రశ్నల వర్షం కురిపించిన సిట్