Minister Lokesh Helpful For Telugu Worker Shiva Reached AP: కువైట్‌లో దుర్భర జీవితం గడుపుతున్న తెలుగు వ్యక్తి శివ ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చొరవతో అతను తన స్వస్థలానికి చేరుకున్నాడు. కువైట్‌లో తన కష్టాలపై తెలుగు కార్మికుడు శివ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టిన వీడియోపై మంత్రి లోకేశ్ స్పందించారు. తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ శివ వేడుకోవడంతో లోకేశ్ అండగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే శివను ఏపీకి తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
ఏపీ మంత్రి లోకేశ్ చొరవతో :శివ పెట్టిన వీడియోపై లోకేశ్ స్పందించి టీడీపీ ఎన్‌ఆర్‌ఐ బృందానికి ఆ బాధ్యతను అప్పగించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాధితుడ్ని ఏపీకి తీసుకొచ్చే వరకు వ్యవహారాన్ని స్వయంగా మంత్రి పర్యవేక్షించారు. శివ స్వస్థలం మదనపల్లి చేరుకోవడం పట్ల లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. శివను చూసి అతని కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురైన వీడియోను లోకేశ్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
చిత్తూరు జిల్లా కల్లూరుకు చెందిన శివ 18 ఏళ్ల కిందట చింతపర్తికి వచ్చి శంకరమ్మను పెళ్లి చేసుకుని, ఇక్కడే అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. శివ భార్య శంకరమ్మ, పెద్ద కుమార్తె ప్రతి రోజు వ్యవసాయ పనులకు కూలీలుగా వెళుతున్నారు. కూలి చేస్తే గానీ పూట గడవని కుటుంబం వీరిది. దీంతో అతను కుటుంబాన్ని విడిచి కువైట్ వెళ్లాడు. అక్కడ ఎడారిలో గొర్రెలు మేకలు, కుక్కలు, కోళ్లు, బాతులు, పావురాలకు కాపలాగా పెట్టినట్లు అందులో పేర్కొన్నాడు. చుట్టుపక్కల కనుచూపు మేరలో ఎవరూ లేరన్నారు.