Konda Surekha reacts on KTR Comments :మహిళలపై నోటికొచ్చినట్లు మాట్లాడి, యథాలాపంగా చేసిన వ్యాఖ్యాలంటూ విచారం వ్యక్తం చేసినంత మాత్రాన ప్రాయశ్చిత్తం కాదని బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్‌ను చదువుకున్న వాళ్లు మాత్రమే అనుసరిస్తారని, బహిరంగంగా గ్రామీణ మహిళలపై వ్యాఖ్యలు చేసి చాటుగా క్షమాపణలు చెప్పడమేంటని ఆమె ప్రశ్నించారు.
ముక్కు నేలకు రాయాలి : మహిళలపై వ్యాఖ్యలకు ప్రాయశ్చితంగా కేటీఆర్ మీడియా ముఖంగా క్షమాపణ చెప్పి, ముక్కు నేలకు రాయాలని మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. క్లబ్బుల్లో, పబ్బుల్లో బ్రేక్ డ్యాన్సులు చేసిన చరిత్ర కేటీఆర్‌కు ఉండొచ్చు కానీ, మహిళా సమాజాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇంకా అహంకారం తగ్గలేదు : ప్రజలు అధికారాన్ని దూరం చేసినప్పటికీ బీఆర్ఎస్ నాయకులకు అహంకారం తగ్గలేదని మంత్రి కొండా సురేఖ దుయ్యబట్టారు. మహిళల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకం పట్ల బీఆర్ఎస్ నాయకులు చిన్నచూపు చూస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై బీఆర్ఎస్ చూపుతున్న ప్రేమ, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆమె వ్యాఖ్యానించారు.