Minister Jupally Krishna Rao about Crop Loss :అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల నష్టపరిహారం అందిస్తామని పర్యాటక శాఖ మంత్రి, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి జూపల్లి కృష్ణారావు అన్నారు. నష్టపోయిన ప్రతి రైతులను ఆదుకుంటామని, ఎవరూ అధైర్య పడొద్దని పేర్కొన్నారు. పంట నష్టంపై అధికారుల సర్వే నివేదిక రాగానే ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను మంత్రి జూపల్లి పరిశీలించారు.
కామారెడ్డి జిల్లాలో దోమకొండ, బిక్కనూరు, కామారెడ్డి మండలాలతోపాటు నిజామాబాద్ జిల్లాలో సిరికొండ, ధర్పల్లి మండలాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను క్షేత్ర స్థాయిలో మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులతో మాట్లాడుతూ ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ రైతులకు అండగా ఉంటుందని, వారిని ఆదుకునే ఏకైక పార్టీ హస్తం పార్టీ అని మంత్రి జూపల్లి అన్నారు. గత పదేళ్లలో కేసీఆర్ అకాల వర్షాలకు నష్టపోయిన రైతలను ఆదుకోలేదని మండిపడ్డారు. వచ్చే పంట కాలానికి ప్రతి రైతు పంటకు బీమా కల్పిస్తామని తెలిపారు.
Jupally on Crop Loss in Nizamabad :రైతు భరోసా కింద 58 లక్షల మంది రైతులకు అందించామని, మిగతా వారికి త్వరలో అందిస్తామని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. రూ. 2 లక్షల రుణ మాఫీ ఒకేసారి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో విత్తనాల సబ్సిడీ, పంటల నష్ట పరిహారం ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురిచేసిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతలకు పంట బీమా, విత్తన సబ్సిడీలు, రైతు భరోసా అందిస్తామన్నారని తెలిపారు.