Vegetables Price Hike In Telangana :కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. రూ.30 ఉన్న కిలో టమాట ధర రూ.100 దాటింది. పచ్చిమిర్చి ధర రూ.120కి పైగానే పలుకుతుంది. ఆకు కూరలను సైతం కొనే పరిస్థితి లేదు. వర్షాకాలం ఆరంభమైనా రాష్ట్రంలో సరిపడా దిగుబడి లేక ఇతర జిల్లాలతో పాటు దిల్లీ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నారు. దళారులు లాభాలు చూసుకుని విక్రయదారులకు అమ్ముతున్నారు. ఇక కూరగాయలు వినియోగదారుని దగ్గరకు వచ్చేసరికి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జాతీయ పోషకాహార సంస్థ లెక్కల ప్రకారం రోజూ ప్రతి ఒక్కరు కనీసం 350 గ్రాముల కూరగాయలు తినాలి. ఈ లెక్కన హైదరాబాద్ నగరానికి రోజుకు 3,300 టన్నుల కూరగాయలు అవసరం. నగరంలోని అన్ని మార్కెట్లకు 2500 నుంచి 2800 టన్నుల కూరగాయలు మాత్రమే వస్తుండటంతో రేట్లు పెరిగి సామాన్యుడు కొనలేని పరిస్థితి ఏర్పడింది.
కూరగాయల ధరలకు రెక్కలు - 15 నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం - WPI Inflation Rises
ఉత్పత్తి లేకపోవడంతో అవస్థలు :నిజామాబాద్ కూరగాయల మార్కెట్‌లో మండుతున్న ధరలను చూసి ప్రజలు జంకుతున్నారు. మారిన వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ నెలలో ఉత్పత్తి లేక అవస్థలు తప్పడం లేదు. నెల ఆరంభం నుంచే కూరగాయలతో పాటు ఎల్లిగడ్డ నుంచి ఉల్లిగడ్డ వరకూ ధరలు పెరిగాయి. గతంలో నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల నుంచి నిజామాబాద్‌కు కూరగాయలు వచ్చేవి. ప్రస్తుతం అక్కడ కూడా దిగుబడి తక్కువగా ఉండటంతో ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు మహారాష్ట్రలోని నాందేడ్, పర్బని, అమరావతి ప్రాంతాల నుంచి కూరగాయలను తీసుకువచ్చి అమ్ముతున్నారు. దీంతో రవాణా, హమాలీ, ఇతర ఖర్చులు కలిపి ధరలపై ప్రభావం పడుతోంది.