Men Played Bathukamma at Husnabad : తెలంగాణలో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు. మహిళలంతా సంప్రదాయ చీరలు, ఆభరణాలు ధరించి, టీనేజ్ అమ్మాయిలైతే లంగా ఓణీ/ హాఫ్ - సారీలు ధరించి చూడముచ్చటగా ముస్తాబవుతారు. ఆ తర్వాత వారంతా బతుకమ్మలను ఒకచోట చేర్చి రామ రామ రామ ఉయ్యాలో అంటూ లయబద్ధంగా పాడుతూ స్టెప్లు వేస్తూ బతుకమ్మ ఆడతారు. ఒక రకంగా చెప్పాలంటే బతుకమ్మ అనేది స్త్రీలకు చెందిన పండుగగా చెప్పొచ్చు. కానీ మన రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో మాత్రం ఆడవాళ్లే కాదు మగవాళ్లు సైతం బతుకమ్మ ఆడతారు. అదేంటి మహిళామణులు ఆడే బతుకమ్మను మగవాళ్లు ఆడటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇది చదివేయండి.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోకి వెళితే రంగురంగుల పూలను తెచ్చి, చక్కగా పేర్చి మగవాళ్లు బతుకమ్మలు ఆడటం కనిపిస్తుంది. ఆడవాళ్లతో పాటే వాళ్లు కూడా తలమీద బతుకమ్మను పెట్టుకుని ఊరేగింపుగా వెళతారు. మహిళలతో కలిసి పాటలు పాడుతూ ఆడతారు. మొదట హుస్నాబాద్ మండలం తోటపల్లిలో ఏటా దసరా నవరాత్రుల్లో ఈ విధంగా మగవారూ సందడి చేసేవారు. దశాబ్దాలుగా ఈ సంప్రదాయాన్ని ఆ గ్రామస్థులు పాటిస్తున్నారు. వారి స్ఫూర్తితో ఇప్పుడు చుట్టుపక్కల మండలాల్లోనూ బతుకమ్మ వేడుకల్లో మగవారే ముందు వరుసలో ఉంటున్నారు. ఈ మగవాళ్ల బతుకమ్మను మీరూ చూడాలనుకుంటే అలా హుస్నాబాద్ వెళ్లి చూసేయండి.