Medigadda Barrage Temporary Repairs :మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా అధికారులు పనులు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కుంగిన ఏడో బ్లాక్ వద్ద ఏరియా క్లియరెన్స్ పనులను సాగిస్తున్నారు. ఆ ప్రాంతంలో డివాటరింగ్ చేయగా 20వ పియర్ ఫ్లాట్పాం ఎదుట బుంగ బయటపడింది. బుంగను ఇంజినీరింగ్ అధికారులు గుర్తించి మట్టి పోసి పూడ్చివేశారు. ఏడో బ్లాక్ ప్రదేశంలో పలు చోట్ల చిన్నపాటి బుంగలు ఏర్పడగా, అధికారులు గుర్తించి పూడ్చి వేసినట్లు తెలుస్తోంది. బ్లాక్ 7లో మొత్తంగా 11 గేట్లు ఉండగా ఎనిమిది గేట్లపై ప్రభావం ఉండటంతో వాటిని మూసేశారు.
ఎన్డీఎస్ఏ కమిటీ, నిపుణుల సూచనల మేరకు పునరుద్ధరణ చర్యలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 15వ గేటును ఎత్తారు. 16 నుంచి 22 గేట్ల వరకు ఎత్తివేతలో భాగంగా గేట్లకు ఉన్న బోల్టులు, తదితర సామగ్రి భాగాలను తీసివేసి పనులను చేస్తున్నారు. 16వ గేటును ఎత్తడానికి సిద్ధమవగా, ఎదురయ్యే సమస్యలు, సాధ్యసాధ్యాలపై పరిశీలన చేస్తున్నారు. గేట్ల ఎత్తివేత ప్రక్రియ సంబంధిత నిపుణుల పర్యవేక్షణలోనే జరగనుంది. ఏడో బ్లాక్ ప్రాంతంలో షీట్ ఫైల్స్ పనుల చేయడానికి కసరత్తు చేస్తున్నారు. బ్యారేజీ దిగువన సీసీ బ్లాక్ అమరిక పనులు ప్రారంభించారు.
పంప్ హౌస్ వద్ద సరిపడా నీటిమట్టం ఉండేలా చూసే అంశంపై కసరత్తు : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ఆనకట్ట పియర్స్ కుంగిన నేపథ్యంలో అక్కడ నీరు నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయింది. బ్యారేజీలో నీటిని నిల్వ చేయవద్దని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సూచించింది. పియర్స్‌కు రక్షణ చర్యలను చేపట్టడంతో పాటు తదుపరి పరీక్షలు చేయాలని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి దశ ఎత్తిపోతల మేడిగడ్డ ఆనకట్ట ఎగువనున్న కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి జరగాల్సి ఉంది. ప్రాణహిత నుంచి వచ్చిన ప్రవాహం వచ్చి గోదావరిలో కలిసిన తర్వాత నీటిని ఎత్తిపోయాలి.