Carrot Cucumber Pan Cake Recipe in Telugu : చాలా మందికి ఈవెనింగ్ టైమ్ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఒక పిల్లలైతే బడి నుంచి రాగానే మమ్మీ తినడానికి స్నాక్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంటారు. ఈ క్రమంలోనే ఎక్కువ మంది బజ్జీలు, పకోడీ, గారెలు, పునుగులు వంటి స్నాక్స్ చేసి పెడుతుంటారు. అయితే, ఎప్పుడూ రొటీన్ రెసిపీస్ కాకుండా ఈసారి కాస్త వెరైటీగా ప్లాన్ చేయండి. మీకోసమే ఒక అద్దిరిపోయే స్నాక్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "క్యారెట్ కీర ప్యాన్‌కేక్స్". ఇవి చాలా రుచికరంగా ఉండి తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. పైగా ఇవి పకోడీలంత నూనెను పీల్చవు! మరి, ఈ సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీకి ఏయే పదార్థాలు అవసరం? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- బియ్యప్పిండి - ముప్పావు కప్పు
- శనగపిండి - 2 టేబుల్‌స్పూన్లు
- మొక్కజొన్న పిండి - 2 టేబుల్‌స్పూన్లు
- సగ్గుబియ్యం పిండి - 1 టేబుల్‌స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- క్యారెట్ - 1
- ఉల్లిపాయ - 1
- కీరదోస - 1
- కొత్తిమీర తరుగు - చారెడు
- అల్లం పేస్ట్ - అర చెంచా
- మిరియాల పొడి - అర చెంచా
- బేకింగ్ పౌడర్ - అర చెంచా
- నూనె - వేయించడానికి సరిపడా
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఉల్లిపాయను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే క్యారెట్, చెక్కు తీసిన కీరను సన్నగా తరుముకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా తరిగి పెట్టుకొన్న సన్నని ఉల్లిపాయ తరుగు, క్యారెట్, కీర తురుము వేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో బియ్యప్పిండి, శనగపిండి, మొక్కజొన్నపిండి, సగ్గుబియ్యం పిండి, మిరియాల పొడి, అల్లం పేస్ట్, ఉప్పు, బేకింగ్ పౌడర్, కొత్తమీర తరుగు, అర కప్పు వాటర్ యాడ్ చేసుకొని పిండిని చక్కగా కలుపుకోవాలి. ఆపై చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
- అనంతరం చపాతీ పీట మీద పాలిథిన్ పేపర్ పరచి కాస్త నూనె అప్లై చేసి ఒక్కో ఉండను ఉంచి చేతి వేళ్ల సాయంతో గుండ్రంగా, కట్లెట్స్ మాదిరిగా వత్తుకోవాలి
- ఇప్పుడు స్టౌపై పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. పెనం వేడయ్యాక ముందుగా చేసుకున్న ప్యాన్‌కేక్స్‌ను వేసుకొని రెండువైపులా మంచిగా కాల్చుకోవాలి.
- ఆ తర్వాత ప్లేట్లోకి తీసుకొని టమాటా సాస్, కెచప్ లేదా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "క్యారెట్ కీర ప్యాన్‌కేక్స్" రెడీ! మరి, నచ్చితే మీరూ ఈవెనింగ్ టైమ్ ఓసారి ఈ రెసిపీని ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా లాగిస్తారు!
ఇవీ చదవండి :
గుడ్డు లేకుండా అద్దిరిపోయే "బ్రెడ్ ఆమ్లెట్" - ఇలా ప్రిపేర్ చేస్తే ఇంకా కావాలంటారు!
క్రిస్పీ అండ్ టేస్టీ "ఆనియన్ బోండా" - ఇలా చేస్తే 10 నిమిషాల్లోనే వేడివేడిగా తినొచ్చు!